మహారాష్ట్ర సీఎం మార్పు తథ్యం.. సంచలన వ్యాఖ్యలు చేసిన ఆ పార్టీ ఎంపీ

by Javid Pasha |
మహారాష్ట్ర సీఎం మార్పు తథ్యం.. సంచలన వ్యాఖ్యలు చేసిన ఆ పార్టీ ఎంపీ
X

దిశ, వెబ్ డెస్క్: ఉద్ధవ్ థాక్రే వర్గం శివసేనకు చెందిన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రంలో సీఎం మార్పు తథ్యం అన్నారు. మహారాష్ట్ర సీఎంగా ఉన్న షిండే తొలగింపు ఖాయమని, కొత్త సీఎం రానున్నారని చెప్పారు. సోమవారం తన నివాసంలో మీడియాతో సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. మహారాష్ట్ర సీఎం షిండే, ఆయనతో పాటు మరో 16 మంది ఎమ్మెల్యేల మెడపై అనర్హత కేసు నడుస్తోందని, త్వరలోనే అందుకు సంబంధించిన తుది తీర్పు రానుందని అన్నారు. షిండేతో పాటు మరో 16 మంది ఎమ్మెల్యేల పదవులు పోవడం ఖాయమని చెప్పారు. ఇదే జరిగితే మహారాష్ట్రలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కూలిపోయే ఛాన్స్ ఉందని, అందుకే బీజేపీ పెద్దలు ఎన్సీపీకి చెందిన అజిత్ పవార్ తో పాటు మరికొంత మంది ఎమ్మెల్యేలను లాక్కున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.

కాగా సరిగ్గా ఏడాది క్రితం ఏక్ నాథ్ షిండే శివసేనపై తిరుగుబాటు చేసిన విషయం తెలిసిందే. శివసేనకు చెందిన ఎమ్మెల్యేలను తీసుకొని బీజేపీతో చేతులు కలిపారు. ఈ క్రమంలోనే ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం కుప్పకూలింది. ఇక బీజేపీ- శివసేస (షిండే వర్గం) కూటమితో ప్రభుత్వం ఏర్పడగా.. షిండే సీఎంగా పగ్గాలు చేపట్టారు. అనంతరం శివసేన పార్టీ షిండే వర్గానికి చెందింది అంటూ ఎన్నికల సంఘం ప్రకటించగా.. దాన్ని సవాలు చేస్తూ ఉద్ధవ్ వర్గం సుప్రీంకోర్టు తలుపులు తట్టింది.

Advertisement

Next Story