మోడీ గారు.. జూన్ తర్వాత ఇది పనిచేయదు!.. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే సంచలన ట్వీట్

by Ramesh Goud |   ( Updated:2024-07-12 07:40:28.0  )
మోడీ గారు.. జూన్ తర్వాత ఇది పనిచేయదు!.. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే సంచలన ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: నరేంద్ర మోడీ గారు.. మీ వైఫల్యాల జాబితా చాలా పెద్దదని, రాబోయే బడ్జెట్ సమావేశాల్లో ఈ ప్రాథమిక ఆర్ధిక అంశాలపై శ్రద్ద వహించాలని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. బడ్జెట్ సమావేశాల నేపధ్యంలో ట్విట్టర్ వేదికగా పలు ప్రతిపాధనలు చేసిన ఆయన బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఖర్గే.. దేశ ప్రజలను నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, అసమానతల అగాధంలోకి నెట్టి, మీ ప్రభుత్వం కోట్లాది ప్రజల జీవితాలను నాశనం చేసిందని ఆరోపించారు. రాబోయే బడ్జెట్ కోసం మీరు కెమెరాల నీడలో సమావేశాలు నిర్వహిస్తున్నప్పుడు, దేశంలోని ఈ ప్రాథమిక ఆర్థిక సమస్యలపై శ్రద్ధ వహించానలి, మీ వైఫల్యాల జాబితా చాలా పెద్దదిగా ఉందని ఎద్దేవా చేశారు. 9.2 శాతం నిరుద్యోగిత రేటుతో యువత భవిష్యత్తు ఏమీ లేకుండా పోతోందని, 20-24 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులకు, నిరుద్యోగం రేటు 40%కి పెరిగిందని, ఇది యువతలో ఉద్యోగ విపణిలో తీవ్ర సంక్షోభాన్ని హైలైట్ చేస్తుందని సూచించారు.

అలాగే రైతుల ఆదాయం, ఖర్చు 50 శాతం పెరిగేలా, ఎంఎస్పీని రెట్టింపు చేస్తామన్న వాగ్దానం అబద్ధమని తేలిందని, తాజాగా, 14 ఖరీఫ్ పంటల ఎమ్మెస్పీపై మోడీ ప్రభుత్వం స్వామినాథన్ నివేదికలోని ఎంఎస్‌పి సిఫార్సును ఎన్నికల జిమ్మిక్కుగా మాత్రమే ఉపయోగిస్తోందని మరోసారి రుజువు చేసిందని అన్నారు. ప్రభుత్వ వాటాలు ఎక్కువగా విక్రయించబడిన 7 పీఎస్‌యూలలో 3.84 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు పోయాయి! దీంతో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ రిజర్వ్‌డ్‌ పోస్టుల్లో ఉద్యోగాలు కూడా కోల్పోయే పరిస్థితి నెలకొందని, 2016 నుండి, మీరు 20 టాప్ పీఎస్‌యూలలో చిన్న వాటాను విక్రయించారని, దీని కారణంగా 1.25 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగాలను కోల్పోయారని ఖర్గే స్పష్టం చేశారు. జీడీపీలో తయారీ శాతం యూపీఏ హయాంలో 16.5 శాతం ఉండగా మోడీ ప్రభుత్వ హయాంలో 14.5 శాతంకి పడిపోయిందని అన్నారు. అలాగే గత పదేళ్లలో ప్రైవేట్ పెట్టుబడులు కూడా బాగా పడిపోయాయని, జీడీపీలో గణనీయమైన భాగమైన కొత్త ప్రైవేట్ పెట్టుబడి ప్రణాళికలు ఏప్రిల్, జూన్ ల మధ్య 20 సంవత్సరాల కనిష్టానికి కేవలం రూ. 44,300 కోట్లకు పడిపోయాయని, గత సంవత్సరం, ఈ కాలంలో ప్రైవేట్ పెట్టుబడులు రూ. 7.9 లక్షల కోట్లుగా ఉందన్నారు.

ద్రవ్యోల్బణం యొక్క వినాశనం గరిష్ట స్థాయికి చేరుకుందని, మైదా, పప్పులు, బియ్యం, పాలు, పంచదార, బంగాళదుంపలు, టమోటాలు, ఉల్లిపాయలు వంటి అన్ని నిత్యావసర ఆహార పదార్థాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని, ఫలితంగా కుటుంబాల పొదుపు 50 ఏళ్లలో కనిష్ట స్థాయికి చేరుకుందని, దీంతో ఆర్థిక అసమానత 100 ఏళ్లలో అత్యధికం అయ్యిందన్నారు. అంతేగాక గ్రామీణ భారతదేశంలో వేతన వృద్ధి ప్రతికూలంగా ఉందని, గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగం గణనీయంగా పెరిగిందని, ఇప్పుడు మేలో 6.3 నుండి 9.3 శాతానికి పెరిగిందని స్పష్టం చేశారు. ఇక ఎంఎన్ఆర్ఈజీఏ కార్మికులు పని చేసే సగటు రోజుల సంఖ్య తగ్గిందని తెలిపారు. మిస్టర్ మోడీ, ఇది 10 సంవత్సరాలు, మీరు ప్రజల ప్రాథమిక సమస్యల నుండి ప్రభుత్వాన్ని దూరంగా ఉంచడానికి మీ పీఆర్ ను ఉపయోగించారు, కానీ జూన్ 2024 తర్వాత, ఇది పనిచేయదని అన్నారు. ప్రజలు ఇప్పుడు జవాబుదారీతనం కోరుతున్నారని, దేశ ఆర్థిక వ్యవస్థను ఏకపక్ష ట్యాంపరింగ్‌ గురి చేయడాన్ని ఇకనైనా స్వస్తి పలకాలి! అని ఖర్గే ఎక్స్ వేదికగా కోరారు.

Advertisement

Next Story