మోడీ 3.0 పాలన షురూ..బాధ్యతలు చేపట్టిన పలువురు మంత్రులు

by vinod kumar |
మోడీ 3.0 పాలన షురూ..బాధ్యతలు చేపట్టిన పలువురు మంత్రులు
X

దిశ, నేషనల్ బ్యూరో: కేంద్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడిన విషయం తెలిసిందే. ప్రధాని మోడీతో సహా 71 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ నేపథ్యంలో మోడీ కేబినెట్‌లోని కొందరు మంత్రులు మంగళవారం బాధ్యతలు చేపట్టారు. దీంతో మోడీ 3.0 పాలన ప్రారంభమైంది. బాధ్యతలు చేపట్టిన వారిలో హోం మంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి జైశంకర్, వైద్య శాఖ మంత్రి జేపీ నడ్డా, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌, పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు, న్యాయ శాఖ మంత్రి అర్జున్‌ రాం మేఘ్‌వాల్‌, కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవియా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌లు ఉన్నారు. వీరంతా తమ తమ కార్యాలయాల్లో బాధ్యతలు చేపట్టారు. అలాగే కేంద్ర మంత్రివర్గంలో కొత్తగా చేరిన వారిలో వ్యవసాయ శాఖ మంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్, హౌసింగ్, పట్టణ వ్యవహారాల మంత్రిగా మనోహర్ లాల్ ఖట్టర్‌లు కూడా బాధ్యతలు స్వీకరించారు.

వీరితో పాటు పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ అలియాస్ లలన్ సింగ్, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రి జితన్‌రామ్‌ మాంఝీ, పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రిగా భూపేంద్ర యాదవ్‌, సహాయ మంత్రిగా కీర్తి వర్ధన్‌, జౌళీ పరిశ్రమ శాఖ మంత్రి గిరిరాజ్‌ సింగ్‌, టెక్స్‌టైల్స్‌ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రిగా పబిత్రా మార్గెరిటా, పెట్రోలియం శాఖ మంత్రి హర్ధీప్ సింగ్ పూరీ, సహాయ మంత్రి సురేశ్‌ గోపీ, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రి చిరాగ్ పాశ్వాన్, మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణా దేవి, ఓడరేవుల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్‌, జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌లు బాధ్యతలు చేపట్టారు. తమకు అవకాశమిచ్చిన ప్రధాని మోడీకి మంత్రులంతా కృతజ్ఞతలు తెలిపారు.

ఎంతో గర్వకారణం: జైశంకర్

విదేశాంగ మంత్రిగా భాద్యతలు స్వీకరించిన తర్వాత డాక్టర్‌ ఎస్‌ జైశంకర్‌ మాట్లాడారు. మరోసారి విదేశాంగ మంత్రిగా బాధ్యతలు స్వీకరించడం గర్వకారణం అని పేర్కొన్నారు. గతసారి జీ20కి అధ్యక్షత వహించామని గుర్తుచేశారు. వ్యాక్సిన్ మైత్రి సరఫరాతో సహా కొవిడ్ సవాళ్లను ఎదుర్కొన్నామన్నారు. ఆపరేషన్ గంగా, ఆపరేషన్ కావేరి వంటి ముఖ్య కార్యక్రమాలను చేపట్టామన్నారు. మెరుగైన పాస్ పోర్టు సేవలు, విదేశాల్లోని భారతీయులకు కమ్యూనిటీ వెల్ఫేర్ ఫండ్ సపోర్టు ఇచ్చామన్నారు.

Advertisement

Next Story

Most Viewed