MK Stalin: విదేశాంగ మంత్రికి లేఖ రాసిన తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్

by S Gopi |
MK Stalin: విదేశాంగ మంత్రికి లేఖ రాసిన తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్
X

దిశ, నేషనల్ బ్యూరో: శ్రీలంక నేవీ స్వాధీనం చేసుకున్న మత్స్యకారులను విడుదల చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్‌కు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ లేఖ రాశారు. గతవారం శ్రీలంక జలాల్లోకి ప్రవేశించి చేపల వేట సాగించిన కారణంగా తమిళనాడుకు చెందిన 17 మంది మత్స్యకారులను శ్రీలంక నేవీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తలైమన్నార్, ధనుష్కోడి మధ్య జలాల్లో జరిగిన ఈ ఘటనలో రెండు బోట్లను కూడా సీజ్ చేశారు. అయితే, రాష్ట్రంలోని మత్స్యకార సంఘం ఎదుర్కొంటున్న సవాళ్లను ఎత్తిచూపిన స్టాలిన్, తరచూ ఇటువంటి సంఘటనలు జరుగుతున్నట్టు, మత్స్యకార కుటుంబాలకు ఈ పరిణామాలు అతిపెద్ద సమస్యగా మారుతున్నాయని వివరించారు. ఇటీవల డిసెంబర్ 20న సైతం శ్రీలంకకు చెందిన ఆరుగురు భారత మత్స్యకారులపై దాడి చేశారని, బోట్లను, జీపీఎస్ సహా ఇతర పరికరాలు, వస్తువులను దోచుకెళ్లినట్టు స్టాలిన్ లేఖలో వివరించారు. ఇలాంటి సంఘటనలు మత్స్యకారులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. వారి జీవితాలు మరింత అనిశ్చితంగా, ప్రమాదకరంగా మారుతున్నాయని స్టాలిన్ అన్నారు. ఈ ఏడాదిలో ఒక్కటే 50 మంది మత్స్యకారులను శ్రీలంక నేవీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. 71 పడవలను సీజ్ చేశారు. శ్రీలంక నేవీ అధికారుల తీరుపై దౌత్యపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. బందీలైన వారిని తక్షణం విడుదల చేసేందుకు చర్యలు అవసరమని పేర్కొన్నారు.

Advertisement

Next Story