Manipur: మణిపూర్‌లో మళ్లీ హింస.. మైతీ గ్రామంపై కాల్పులు

by vinod kumar |
Manipur: మణిపూర్‌లో మళ్లీ హింస.. మైతీ గ్రామంపై కాల్పులు
X

దిశ, నేషనల్ బ్యూరో: కొన్ని రోజులుగా అల్లర్లు లేకుండా ఉన్న మణిపూర్‌లో మరో సారి హింస నెలకొంది. జిరిబామ్ జిల్లాలోని మోంగ్‌బంగ్ అనే మైతీ గ్రామంపై శనివారం మధ్యాహ్నం 11:30 గంటల సమయంలో దుండగులు కాల్పులకు తెగపడ్డట్టు పోలీసులు తెలిపారు. సుమారు 3 గంటల పాటు కాల్పులు జరిపారు. అనంతరం గ్రామ వాలంటీర్లు సైతం ఎదురు దాడికి దిగారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హింసాకాండ నేపథ్యంలో వృద్ధులు, మహిళలు, చిన్నారులను పోలీసులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఘటనా ప్రాంతంలో భారీగా భద్రతా బలగాలను మోహరించడంతో దుండగులు కాల్పులు ఆపి పారిపోయారు. అయితే ఈ దాడుల్లో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. కాగా, మోంగ్‌బంగ్ మెయిటీ గ్రామం జాతి ఘర్షణ సమయంలో అనేక దాడులను చూసింది.

మరోవైపు, మయన్మార్ నుంచి 900 మంది కుకీ మిలిటెంట్లు మణిపూర్‌లోకి ప్రవేశించారని భద్రతా సలహాదారు కుల్దీప్ సింగ్ చేసిన ప్రకటనకు నిరసనగా ఇండీజినస్ ట్రైబల్ లీడర్స్ ఫోరమ్ (ఐటీఎల్ఎఫ్), కుకీ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ (కేఎస్ఓ)తో సహా పలు కుకీ సంఘాలు రెండు రోజుల బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చురచంద్‌పూర్‌, కాంగ్‌పోక్పీ జిల్లాల్లో వరుసగా రెండో రోజు బంద్‌ కొనసాగింది. మార్కెట్లు, పాఠశాలలు మూత పడ్డాయి. అలాగే తౌబాల్ జిల్లాకు చెందిన ముగ్గురు యువకులు ఇంఫాల్ వెస్ట్ జిల్లాలో నిర్వహిస్తున్న ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీలో పాల్గొనడానికి వెళ్లగా.. అందులో ఇద్దరు అదృశ్యమైనట్టు పోలీసులు తెలిపారు. వారిద్దరినీ రక్షించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు.

Advertisement

Next Story

Most Viewed