అమిత్ షా వార్నింగ్‌తో మణిపూర్‌ మిలిటెంట్లలో కదలిక.. ఐదు జిల్లాల్లో కర్ఫ్యూ ఎత్తివేత

by Vinod kumar |
అమిత్ షా వార్నింగ్‌తో మణిపూర్‌ మిలిటెంట్లలో కదలిక.. ఐదు జిల్లాల్లో కర్ఫ్యూ ఎత్తివేత
X

న్యూఢిల్లీ : కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇచ్చిన వార్నింగ్‌తో మణిపూర్‌ మిలిటెంట్లలో కదలిక మొదలైంది. మణిపూర్‌‌లోని వివిధ ప్రాంతాల్లో 140 ఆయుధాలను పోలీసులకు సరెండర్ చేశారు. ఆయుధాలు కలిగిన వారి కోసం శుక్రవారం నుంచి కూంబింగ్ ఆపరేషన్‌ను మొదలుపెడతామని, దొరికిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అమిత్ షా హెచ్చరించారు. ఇవాళ్టి నుంచి కూంబింగ్ ఆపరేషన్ మొదలవుతుందనగా.. ఉదయాన్నే చాలామంది పోలీస్ స్టేషన్లకు వెళ్లి తమ దగ్గరున్న ఆయుధాలను సరెండర్ చేశారు. రాష్ట్రంలో ఉద్రిక్తతలు తగ్గడంతో ఇంఫాల్ వెస్ట్, ఇంఫాల్ ఈస్ట్, బిష్ణుపూర్‌లో 12 గంటల పాటు (ఉదయం 5 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య) కర్ఫ్యూను సడలించారు.

జిరిబామ్‌లో ఎనిమిది గంటలు (ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య) సడలింపు ఇచ్చారు. తౌబల్మ, కక్చింగ్‌‌లలో ఏడు గంటలు (ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య), చురచంద్‌పూర్, చందేల్‌లో 10 గంటలు (ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య), తెంగ్నౌపాల్‌లో ఎనిమిది గంటలు (ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 వరకు); కాంగ్‌పోక్పిలో 11 గంటలు (ఉదయం 6 నుంచి సాయంత్రం 5 వరకు), ఫెర్జాల్‌లో 12 గంటలు (ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు) కర్ఫ్యూను సడలించారు. తమెంగ్‌లాంగ్, నోనీ, సేనాపతి, ఉఖ్రుల్ మరియు కమ్‌జోంగ్ అనే ఐదు జిల్లాల్లో కర్ఫ్యూ పూర్తిగా ఎత్తేశారు. ఇక గత నెలలో (మే) మణిపూర్‌లో జరిగిన హింసాకాండలో 98 మంది మరణించగా, 300 మందికి గాయాలయ్యాయని జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.

Advertisement

Next Story

Most Viewed