Ajith Pawar: రాజకీయాలను ఇంటి వ్యవహారాల్లోకి రానివ్వకూడదు

by Shamantha N |
Ajith Pawar: రాజకీయాలను ఇంటి వ్యవహారాల్లోకి రానివ్వకూడదు
X

దిశ, నేషనల్ బ్యూరో: రాజకీయాలను ఇంటి వ్యవహారాల్లోకి రానివ్వకూడదని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, నేషనలిస్ట్‌ కాంగ్రెస్ పార్టీ నేత అజిత్‌ పవార్‌ (Ajit Pawar) అన్నారు. బారామతి స్థానం నుంచి తన సోదరి సుప్రియ సూలేపై తన భార్య సునేత్ర పవార్ ని పోటీలో నిలపడం తప్పేనని పేర్కొన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ అజిత్ పవార్ రాష్ట్రవ్యాప్తంగా 'జన్ సమ్మాన్ యాత్ర' నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఓ మరాఠీ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. "నేను నా సోదరీలు అందరినీ ప్రేమిస్తున్నా. రాజకీయాలను ఇంటి వ్యవహారాల్లోకి తీసుకురావద్దు. నా సోదరిపై సునేత్రను పోటీకి దింపి తప్పు చేశారు. ఎన్సీపీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయం తప్పని భావిస్తున్నాను' అని అజిత్ పవార్ అన్నారు. శరద్‌ పవార్‌ సీనియర్‌ నేత మాత్రమే కాదని, తమ ఇంటి పెద్ద అని చెప్పారు. ఆయన తనపై చేసే విమర్శలపై స్పందించబోనని అన్నారు. శరద్ పవార్ పై బీజేపీ, శివసేన, ఎన్సీపీ నేతలు విమర్శలు గుప్పించడం సరికాదని పేర్కొన్నారు. కూటమి నేతలు భేటీ అయినప్పుడు దీనిపై తన అభిప్రాయాన్ని వ్యక్తంచేస్తానని అజిత్‌ పవార్‌ చెప్పారు.

ఎన్సీపీలో చీలికలు

బారామతి ఎన్నికలు సుప్రియా సూలే, సునేత్ర పవార్ మధ్య జరిగినప్పటికీ.. అది శరద్ పవార్ వర్సెస్ అజిత్ పవార్ గా మారింది. ఎన్నికల్లో సునేత్రపై సుప్రియా సూలే 1.5 లక్షల ఓట్ల తేడాతో గెలిచారు. దీంతో, ఎన్నికల్లో వరుసగా నాలుగోసారి విజయం సాధించారు. బారామతి స్థానాన్ని శరద్ పవార్ 14 సార్లు గెలుచుకున్నారు. ఎన్సీపీ అధినేత 1967 నుంచి నియోజకవర్గాన్ని పోషించుకుంటున్నారు. మహా వికాస్ అఘాడి (MVA) మహారాష్ట్రలోని 48 లోక్‌సభ స్థానాల్లో 30 స్థానాలను గెలుచుకుని అధికార మహాయుతి కూటమికి షాక్ ఇచ్చింది. అజిత్‌ పవార్‌ నేతృత్వంలోని ఎన్సీపీ కేవలం రాయగఢ్‌లో ఒక్క సీటును మాత్రమే గెలుచుకోగా.. శరద్‌పవార్‌ వర్గం 8 సీట్లు గెలుచుకుంది. గతేడాది ఎన్సీపీలో చీలిక వచ్చిన సంగతి తెలిసిందే. అజిత్‌ పవార్‌ నేతృత్వంలోని పలువురు ఎమ్మెల్యేలు శివసేన- బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో చేరిపోయారు. అదేసమయంలో అజిత్‌ పవార్‌ నేతృత్వంలోని పార్టీనే అసలైన పార్టీ అని ఎన్నికల సంఘం పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed