రేపటి నుంచి 18వ లోక్‌సభ తొలి సెషన్

by S Gopi |
రేపటి నుంచి 18వ లోక్‌సభ తొలి సెషన్
X

దిశ, నేషనల్ బ్యూరో: కేంద్రంలో వరుసగా మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో మూడో టర్మ్ తొలి పార్లమెంట్ సమావేశాలు నేడు(జూన్ 24) ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు మొదలయ్యే సమావేశాల్లో మొదటిరోజే సుమారు 280 మంది లోక్‌సభ ఎంపీలు ప్రమాణస్వీకారం చేస్తారు. ప్రత్యేక సమావేశాలు కావడంతో క్వశ్చర్ అవర్, జీరో అవర్ ఉండదు. ప్రొటెం స్పీకర్ భర్తృహరి మెహతాబ్ ఎంపీలందరితో ప్రమాణం చేయిస్తారు. మొదటగా ప్రధాని మోడీ ప్రమాణం చేసిన అనంతరం సీనియారిటీ ఆధారంగా మంత్రులు, ఎంపీల ప్రమాణ స్వీకారం జరుగుతుంది.

సభ ఎలా జరుగుతుందంటే..

తొలుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్‌లో లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా భర్తృహరి మహతాబ్‌తో ప్రమాణం చేయిస్తారు. భర్తృహరి పార్లమెంట్ హౌస్‌కు చేరుకుని, ఉదయం 11 గంటలకు లోక్‌సభను ఆర్డర్ చేయడానికి పిలుస్తారు. లోక్‌సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ దిగువ సభకు ఎన్నికైన సభ్యుల జాబితాను సభ టేబుల్‌పై ఉంచుతారు. ఆ తర్వాత సభా నాయకుడైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీని సభ సభ్యునిగా ప్రమాణం చేయవలసిందిగా ప్రొటెం స్పీకర్ పిలుపునిస్తారు. మోడీ తర్వాత మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, సహాయ మంత్రులు, మిగిలిన ఎంపీలు రాష్ట్రాల వారీగా అక్షర క్రమంలో ప్రమాణ చేయనున్నారు. రెండోరోజు మిగిలిన ఎంపీల ప్రమాణ స్వీకారం ఉండనుంది.

అనంతరం జూన్ 26న లోక్‌సభ స్పీకర్ ఎన్నిక జరగనుంది. అనంతరం ప్రధానమంత్రి కేంద్ర మంత్రులను సభకు పరిచయం చేస్తారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జూన్ 27న పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశంలో ప్రసంగించనున్నారు. 28వ తేదీ నుంచి రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగనుంది.

తెలుగు ఎంపీల ప్రమాణం ఎప్పుడంటే..

కేబినెట్‌ మంత్రుల ప్రమాణం రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో ప్రారంభమవుతుంది. కేబినెట్, తర్వాత స్వతంత్ర హోదా సహాయ మంత్రులు, సహాయ మంత్రులుగా ఉన్న లోక్‌సభ సభ్యులు ప్రమాణం జరగనుంది. అనంతరం కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్రాలకు చెందిన సభ్యులను అక్షర క్రమంలో పిలుస్తారు. సాధారణ సభ్యుల్లో అండమాన్‌ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ సభ్యుడు బిష్ణుపద రే మొదట ప్రమాణం చేస్తారు. ఆ తర్వాతే ఆంధ్రప్రదేశ్‌ సభ్యుల ప్రమాణ క్రమం అరకు ఎంపీతో మొదలై చిత్తూరుతో ముగుస్తుంది. తెలంగాణ సభ్యుల ప్రమాణాలు ఆదిలాబాద్‌తో మొదలై ఖమ్మంతో ముగుస్తాయి.

కొన్ని రోజుల విరామం అనంతరం జులై 22న పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పూర్తిస్థాయి బడ్జెట్‌ను జులై 22న ప్రవేశపెట్టనున్నారు. ఆ సమావేశాల్లో ధరల పెరుగుదల, ఆహార ద్రవ్యోల్బణం, తీవ్ర వేడిగాలుల కారణంగా మరణాలు, విద్యార్థులను ఆందోళనకు గురిచేసిన నీట్ లాంటి పరీక్షల నిర్వహణలో ఇటీవలి అవకతవకలు వంటి అనేక సమస్యలపై ప్రతిపక్షం ప్రభుత్వాన్ని నిలదీయనుందని భావిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed