తొలి విడత పోలింగ్.. బరిలో కీలక అభ్యర్థులు వీరే

by Hajipasha |
తొలి విడత పోలింగ్.. బరిలో కీలక అభ్యర్థులు వీరే
X

దిశ, నేషనల్ బ్యూరో : దేశంలో ఓట్ల పండుగ శుక్రవారం (ఏప్రిల్ 19న) ప్రారంభం కానుంది. సార్వత్రిక ఎన్నికల మొదటిదశ పోలింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది. తొలి విడతలో భాగంగా 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలోని 102 స్థానాల్లో పోలింగ్ జరగనుంది. తమిళనాడులో సింగిల్ ఫేజ్‌లోనే ఎన్నికలు పూర్తికానున్నాయి. 18వ లోక్‌సభ ఎన్నికల్లో 543 స్థానాలకు ఏడు దశల్లో పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు చేసి ఫలితాలను విడుదల చేస్తారు. తొలి విడతలో పోటీ చేస్తున్న కీలక నేతల జాబితాలో 8 మంది కేంద్ర మంత్రులు, ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు, ఒక మాజీ గవర్నర్ ఉన్నారు. ఆయా ముఖ్యమైన స్థానాల వివరాలివీ..

* కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ - నాగ్‌పూర్

కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ నాగ్‌పూర్ స్థానం నుంచి హ్యాట్రిక్ విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఏడుసార్లు ఎంపీగా ఎన్నికైన విలాస్ ముత్తెంవార్‌ను 2014లో గడ్కరీ 2.84 లక్షల ఓట్ల తేడాతో ఓడించారు. ప్రస్తుత మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలేను 2019లో 2.16 లక్షల ఓట్లతో ఓడించి నాగ్‌పూర్ సీటును గడ్కరీ నిలబెట్టుకున్నాడు.

* కేంద్రమంత్రి కిరణ్ రిజిజు - అరుణాచల్ వెస్ట్

కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అరుణాచల్ పశ్చిమ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. 52 ఏళ్ల వయసున్న ఆయన 2004 నుంచి మూడుసార్లు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. ఈ స్థానంలో రిజిజు ప్రధాన ప్రత్యర్థి నబమ్ టుకీ. టుకీ గతంలో అరుణాచల్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రస్తుత అరుణాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా టుకీయే.

* కేంద్రమంత్రి సర్వానంద సోనోవాల్ - దిబ్రూగఢ్

కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్వానంద సోనోవాల్ అసోంలోని దిబ్రూగఢ్ నుంచి లోక్‌సభకు పోటీ చేస్తున్నారు. వాస్తవానికి కేంద్ర పెట్రోలియం,సహజవాయువు శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తేలి ఈ టికెట్‌ను ఆశించారు. కానీ అందుకు పార్టీ అధిష్టానం నో చెప్పింది. రాజ్యసభ సభ్యుడు సర్వానంద సోనోవాల్‌ను ఇక్కడి నుంచి బరిలోకి దింపింది.

* కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ - ఉదంపూర్‌

కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ఉదంపూర్‌ నుంచి వరుసగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.కశ్మీర్‌లో భౌగోళికంగా అతిపెద్ద నియోజకవర్గం ఉదంపూరే.

* కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్ - అల్వార్

రాజస్థాన్‌లోని అల్వార్ లోక్‌సభ ఎంపీ బాబా బాలక్‌నాథ్‌ను సీఎం చేస్తారని గతంలో ప్రచారం జరిగింది. తీరా చూస్తే ఈ ఎన్నికల్లో ఆయనకు లోక్‌సభ టికెట్ కూడా దక్కలేదు.ఇక్కడి నుంచి ఈసారి కేంద్ర మంత్రి, రాజ్యసభ సభ్యుడు భూపేంద్ర యాదవ్ పోటీ చేస్తున్నారు. ఇక కాంగ్రెస్‌ తరఫున ఎమ్మెల్యే లలిత్ యాదవ్‌ ఎన్నికల బరిలోకి దిగారు. యాదవ్‌కు ఆయన సామాజికవర్గం మద్దతు బలంగా ఉంది.

* కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ - బికనీర్

రాజస్థాన్‌లోని బికనీర్ స్థానం నుంచి కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ పోటీ చేస్తున్నారు. ఆయనతో కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి గోవింద్ రామ్ మేఘ్వాల్‌ తలపడుతున్నారు.

* కేంద్ర మంత్రి ఎల్‌ మురుగన్‌ - నీలగిరి

తమిళనాడులోని నీలగిరి లోక్‌సభ స్థానం నుంచి కేంద్ర మత్స్యశాఖ సహాయ మంత్రిగా ఉన్న బీజేపీ నేత ఎల్‌ మురుగన్‌ పోటీ చేస్తున్నారు. ఇక్కడి నుంచి ప్రస్తుత డీఎంకే ఎంపీ, మాజీ కేంద్రమంత్రి ఏ.రాజా బరిలో ఉన్నారు. తమిళనాడుకు చెందిన మురుగన్‌ను.. బీజేపీ అధిష్టానం మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు నామినేట్ చేసింది. మురుగన్ ఈ స్థానం నుంచి పోటీ చేయడం ఇదేతొలిసారి.

* కార్తీ చిదంబరం - శివగంగ

తమిళనాడులోని శివగంగ స్థానంలో హోరాహోరీ పోరు నెలకొంది. కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం తన తండ్రి పి.చిదంబరం ఏడుసార్లు గెలిచిన శివగంగ స్థానం నుంచి బరిలోకి దిగారు. ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్థిగా టి. దేవనాథన్ యాదవ్, అన్నా డీఎంకేకు చెందిన జేవియర్ దాస్‌ పోటీ చేస్తున్నారు.

* కె. అన్నామలై - కోయంబత్తూర్‌

తమిళనాడులోని కోయంబత్తూర్‌ స్థానం నుంచి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామలై పోటీ చేస్తున్నారు. ఇక్కడి నుంచి డీఎంకే అభ్యర్థిగా గణపతి పి.రాజ్‌కుమార్, అన్నా డీఎంకే అభ్యర్థిగా సింగై రామచంద్రన్‌ బరిలోకి దిగారు.

* తమిళిసై సౌందరరాజన్ - చెన్నై సౌత్

తమిళనాడులోని చెన్నై సౌత్ స్థానం నుంచి తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పోటీ చేస్తున్నారు. డీఎంకే నుంచి తమిజాచి తంగపాండ్యన్, కాంగ్రెస్ నుంచి అనంత కుమారి పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రధాన పార్టీ అభ్యర్థులంతా మహిళలే కావడం విశేషం. 2019 ఎన్నికల్లో తమిళిసై తూత్తుకుడి లోక్‌సభ స్థానం నుంచి కనిమొళిపై పోటీ చేసి ఓడిపోయారు.

* కనిమొళి - తూత్తుకుడి

కనిమొళి ఈసారి కూడా తూత్తుకుడి లోక్‌సభ స్థానం నుంచే పోటీ చేస్తున్నారు. ఎన్‌డీఏ మిత్రపక్షమైన తమిళ మానిల కాంగ్రెస్ (మూపనార్)కు చెందిన నేత ఎస్‌డీఆర్ విజయశీలన్‌ ఇక్కడి నుంచి బరిలోకి దిగారు. అన్నా డీఎంకే నుంచి ఆర్. శివసామి వేలుమణి పోటీ చేస్తున్నారు.

* నకుల్ నాథ్ - చింద్వారా

కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్ కుమారుడు నకుల్ నాథ్ ఈసారి చింద్వారా స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. 1980వ దశకం నుంచి ఇప్పటివరకు ఈ సీటును కమల్ నాథ్ తొమ్మిది సార్లు గెలిచారు. 2019 ఎన్నికలలో ఈ సీటు నుంచి పోటీ చేసిన నకుల్ 37,536 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థిని ఓడించారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్‌ నుంచి ఎన్నికైన ఏకైక ఎంపీ నకుల్ నాథే కావడం గమనార్హం.

Advertisement

Next Story