Krishna Janmabhoomi case: శ్రీ కృష్ణ జన్మభూమి కేసు..హైకోర్టులో ముస్లిం పక్షం పిటిషన్ తిరస్కరణ

by vinod kumar |
Krishna Janmabhoomi case: శ్రీ కృష్ణ జన్మభూమి కేసు..హైకోర్టులో ముస్లిం పక్షం పిటిషన్ తిరస్కరణ
X

దిశ, నేషనల్ బ్యూరో: మధురలోని శ్రీకృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా వివాదంలో ముస్లిం పక్షం దాఖలు చేసిన పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు తిరస్కరించింది. జస్టిస్ మయాంక్ కుమార్ జైన్‌తో కూడిన సింగిల్ బెంచ్ గురువారం తీర్పు వెలువరించింది. షాహీ ఈద్గా కమిటీకి నిబంధనలకు విరుద్ధంగా భూమి ఇచ్చారని హిందూ పక్షం దాఖలు చేసిన 18 పిటిషన్లను మసీదు కమిటీ నేతలు హైకోర్టులో సవాల్ చేశారు. ఔరంగజేబ్ కాలం నాటి మసీదు కృష్ణ దేవాలయాన్ని కూల్చివేసిన తర్వాత నిర్మించారని పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం జూన్ 6న తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా ముస్లిం పక్షాల పిటిషన్ తిరస్కరిస్తున్నట్టు తెలిపింది.

హిందూ పక్షం దాఖలు చేసిన 18 పిటిషన్లను కలిపి విచారిస్తామని వెల్లడించింది. తదుపరి విచారణను ఆగస్టు 12కు వాయిదా వేసింది. అంతకుముందు విచారణలో భాగంగా 1968లో చేసుకున్న ఒప్పందం ప్రకారం మసీదు కోసం స్థలం ఇచ్చారని ముస్లిం పక్షం వాదించింది. 60 ఏళ్ల తర్వాత ఒప్పందాన్ని తప్పు అనడం సరికాదని తెలిపింది. హిందూ పక్షం పిటిషన్లు విచారణకు విలువైనవి కావని పేర్కొంది. అయితే ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు ముస్లింల వాదనను అంగీకరించలేదు.

Next Story