తమిళనాడులో కల్తీ సారా కాటుకు మృత్యుఘోష

by S Gopi |
తమిళనాడులో కల్తీ సారా కాటుకు మృత్యుఘోష
X

దిశ, నేషనల్ బ్యూరో: తమిళనాడు రాష్ట్రంలోని కళ్లకురిచి జిల్లాలో కల్తీ సారా తాగిన ఘటనలో మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కరుణాపురంలో నాటు సారా తాగి మరణించిన వారి సంఖ్య 51కి చేరుకుందని తమిళనాడు మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ సంగుమణి వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. దాదాపు 109 మంది బాధితులు జిల్లాలోని వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 20 మంది పరిస్థితి విషమంగా ఉంది. కల్తీ సారా కారణంగా కొందరికి కిడ్నీలు, ఇతర అవయవాలు ఫెయిల్ అవుతుండటంతో తమిళనాడు ప్రభుత్వం నిపుణులైన వైద్యులను రప్పించింది. పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శివదాస్ మీనా జిల్లా కలెక్టర్లు, పోలీసు సూపరింటెండెంట్లతో సంప్రదింపులు జరిపారు. మరోవైపు కల్తీ మద్యం సేవించి పలువురు మృతి చెందిన ఈ దుర్ఘటనపై విచారణ ప్రారంభించామని, మూడు నెలల్లో నివేదిక అందజేస్తామని జస్టిస్‌ గోకుల్‌దాస్‌ (రిటైర్డ్‌) శుక్రవారం తెలిపారు. అంతకుముందు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున, చికిత్స పొందుతున్న వారికి రూ.50 వేలు ప్రకటించారు.

Advertisement

Next Story

Most Viewed