'కచా బాదం' గాయకుడు 'సెలబ్రిటీ' వ్యాఖ్యల‌పై దుమారం! 'ఇంత‌కీ శెన‌క్కాయల సంగ‌తేంటి..?!'

by Sumithra |
కచా బాదం గాయకుడు సెలబ్రిటీ వ్యాఖ్యల‌పై దుమారం! ఇంత‌కీ శెన‌క్కాయల సంగ‌తేంటి..?!
X

దిశ‌, వెబ్‌డెస్క్ః 'కచా బాదం' సింగ‌ర్ ప్ర‌స్తుతం చాలా మందికి సుప‌రిచిత‌మే. శెన‌క్కాయ‌ల‌మ్ముకునే భుబ‌న్ బ‌ద్యాక‌ర్ 'క‌చా బాదం' అనే పాట సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయ్యిందో భుబ‌న్ కూడా అంతే పాపుల‌ర్ అయ్యాడు. ఓవ‌ర్ నైట్ స్టార్ అయిన ఈ 'సెల‌బ్రిటీ' సింగ‌ర్ ఇటీవ‌ల తాను ఇక‌పై శెన‌క్కాయ‌లు అమ్మ‌న‌ని అన్నాడు. 'క‌చా బాదం' పాట‌తో నేను సెల‌బ్రిటీ అయ్యాను, ప్ర‌జ‌లు నా పాట‌కు డ్యాన్స్ చేస్తున్నారు. అలాగే, నాకు చాలా గుర్తింపు కూడా ఇస్తున్నారు. క‌నుక నేను ఇప్పుడు వేరుశెన‌క్కాయ‌లు అమ్మ‌డానికి ప్ర‌య‌త్నించినా ప్ర‌జ‌లు నా ద‌గ్గ‌ర‌ కొన‌రు. అంద‌రూ నా పాట విన‌డానికే ఇష్టప‌డ‌తారు. కాబ‌ట్టి నేను శెన‌క్కాయ‌లు అమ్మ‌ను..' అని చెప్ప‌డంతో పాట విని మెచ్చుకున్న జ‌న‌మే బ‌ద్యాక‌ర్ నిర్ణ‌యాన్ని విమ‌ర్శిస్తున్నారు. సెల‌బ్రిటీ స్టేట‌స్ వ‌స్తే జీవ‌నాధారాన్ని వ‌దిలేస్తావా అంటూ మండిప‌డ్డారు.

ఇలాంటి ప్ర‌తిస్పంద‌న వ‌స్తుంద‌ని ఊహించ‌ని బ‌ద్యాక‌ర్ విమర్శల అనంతరం తాను ఆ వ్యాఖ్యలు చేసుండ‌కూడ‌ద‌ని అన్నాడు. ఇటీవ‌ల త‌న‌కు స‌న్మానం చేసిన‌ ఓ కార్యక్రమంలో దీనిపై స్పందించాడు. 'నేను అలా అనకూడదని ఇప్పుడు అర్థమైంది. ప్రజలు నన్ను సెలబ్రిటీని చేసారు. అయినా, ఆ పరిస్థితి వస్తే నేను మళ్ళీ వేరుశెనగలు అమ్ముతాను. మీ అందరి నుండి ఇలాంటి ప్రేమను పొందడం అదృష్టంగా భావిస్తున్నాను. నేనొక‌ సాధారణ మనిషిని, అదే జీవితాన్ని నేను మొద‌టి నుంచీ అనుభ‌వించాను. అదే, నా నిజ‌మైన జీవితం.ఈ స్టార్‌డమ్, మీడియా అటెన్షన్, గ్లామర్ ఇవ‌న్నీ క‌ల‌కాలం ఉండ‌వ‌ని తెలుసు. నేను నేనుగానే ఉంటాన‌ని మీకు భ‌రోసా ఇస్తున్నాను' అన్నాడు.

ఇక‌, 'కచా బాదం' స‌క్సెస్ త‌ర్వాత‌ బద్యాకర్ 'అమర్ నోటున్ గాడి' (నా కొత్త కారు) అనే కొత్త పాటను విడుదల చేశాడు. ఇటీవ‌ల త‌న సెకండ్ హ్యాండ్ కారును న‌డుపుతూ ప్ర‌మాదానికి గురై, ఆసుప‌త్రి నుంచి ఇంటికొచ్చిన త‌ర్వాత ప్రమాదం ఎలా జ‌రిగింది, తీవ్ర గాయాలు నుండి దేవుడు అతనిని ఎలా రక్షించాడు అనే దాని గురించి ఈ పాట రూపొందించాడు.

Advertisement

Next Story

Most Viewed