రాజ్యసభలో సభా నాయకుడిగా జేపీ నడ్డా

by S Gopi |
రాజ్యసభలో సభా నాయకుడిగా జేపీ నడ్డా
X

దిశ, నేషనల్ బ్యూరో: కేంద్ర ఆరోగ్య మంత్రి, బీజేపీ నేత జేపీ నడ్డా రాజ్యసభలో సభా నాయకుడిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. బీజేపీ అధ్యక్షుడిగా నడ్డా పదవీకాలం జనవరిలోనే ముగిసింది. అయితే లోక్‌సభ 2024 ఎన్నికలను పర్యవేక్షించే కారణంతో ఆరు నెలల పొడిగింపు ఇచ్చారు. ఈ నెలతో ఆయన పదవీకాలం ముగియనుంది. అయితే, ఈ ఏడాది చివర్లో నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనుండగా, అవి పూర్తయ్యే వరకు పార్టీ అధ్యక్షుడిగా కొనసాగేందుకు అధిష్ఠానం ఒప్పించినట్టు సమాచారం. అంతకుముందు 2019లో లోక్‌సభ ఎన్నికల వేళ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న అమిత్ షా కేంద్ర హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం 2020, జనవరిలో జేపీ నడ్డా పూర్తిస్థాయి అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నారు. ముఖ్యంగా పార్టీ బలోపేతం చేయడంలో ఆయన కీలకంగా వ్యవహరించారు. తాజా 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా నడ్డా ప్రమాణం చేశారు. ఆయనకు ఆరోగ్య మంత్రిత్వ శాఖతో పాటు రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖను కేటాయించారు. నడ్డా 2019లో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించడానికి ముందు మోడీ ప్రభుత్వ మొదటి టర్మ్‌లో ఆరోగ్య శాఖను నిర్వహించారు.

Advertisement

Next Story

Most Viewed