Quad Summit: జోబైడెన్ సదస్సుకు హాజరవుతారని ప్రకటించిన వైట్ హౌజ్

by Shamantha N |
Quad Summit: జోబైడెన్ సదస్సుకు హాజరవుతారని ప్రకటించిన వైట్ హౌజ్
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్‌ ఆధ్వర్యంలో జరిగే క్వాడ్‌ దేశాధినేతల(Quad Summit) సదస్సుకు అమెరికా అధ్యక్షుడు(US President) జో బైడెన్(Joe Biden) హాజరుకానున్నారు. ఈ విషయాన్ని వైట్ హౌజ్(White House) అధికారికంగా ప్రకటించింది. ‘‘ఈ ఏడాది క్వాడ్‌ నేతల సదస్సుకు హాజరయ్యేందుకు ఇప్పటికీ మేం కట్టుబడి ఉన్నాం. బైడెన్‌ ఈసారి ఎన్నికల బరిలో నిలుచోవట్లేదని తేలింది. దీంతో ఆయన షెడ్యూల్ లో చాలా అవకాశాలు ఉన్నాయి.వీటిని వాడుకొని విదేశాంగ విధానం ఎజెండా, జాతీయ భద్రతావకాశాలను ముందుకు తీసుకెళ్లాలనే అంశం గురించి ఆలోచిస్తున్నాం. ఇప్పుడే చెప్పేందుకు షెడ్యూల్‌ అయితే ఏమీ లేదు. వేచి చూడండి” అని వైట్ హౌజ్ నేషనల్‌ సెక్యూరిటీ కమ్యూనికేషన్‌ సలహాదారు జాన్‌ కిర్బీ పేర్కొన్నారు.

2020 నుంచి వర్చువల్ గా క్వాడ్ సదస్సు

కరోనా వల్ల 2020 నుంచి క్వాడ్‌ సదస్సులు వర్చువల్‌ విధానంలో జరుగుతున్నాయి. ఈ ఏడాది మాత్రం భారత్‌లో నిర్వహించాలని భావిస్తున్నారు. ఉక్రెయిన్‌, గాజా ప్రాంతాల్లో యుద్ధం కొనసాగుతుండటం.. పర్యావరణ అంశాలు కొలిక్కి రాకపోవడంతో జోబైడెన్‌ మరికొన్ని కొత్త అవకాశాలను పరిశీలించాలని భావిస్తున్నారని కిర్బీ తెలిపారు. ఈ ఏడాది జనవరి చివరివారంలో జరగాల్సిన క్వాడ్‌ సదస్సును భారత్‌ అనేక సార్లు రీషెడ్యూల్ చేసింది. సదస్సుకు రావడానికి జోబైడెన్‌ నిరాకరించడంతో క్వాడ్‌ సదస్సును కూడా వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకొంది. ఇలాంటి టైంలో వైట్ హౌజ్ నుంచి ఈ ప్రకటన వెలువడింది.



Next Story