Hemant Soren : సీఎం సోరెన్‌ హెలికాప్టర్‌ టేకాఫ్‌లో జాప్యం.. రాష్ట్రపతికి జేఎంఎం లేఖ

by Hajipasha |
Hemant Soren : సీఎం సోరెన్‌ హెలికాప్టర్‌ టేకాఫ్‌లో జాప్యం.. రాష్ట్రపతికి జేఎంఎం లేఖ
X

దిశ, నేషనల్ బ్యూరో : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(PM Modi) జార్ఖండ్ పర్యటన నేపథ్యంలో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్(Hemant Soren) హెలికాప్టర్‌ టేకాఫ్‌‌లో గంటన్నర పాటు జాప్యం చేశారని అధికార జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) నేతలు ఆరోపించారు. ఈవిషయంలో జోక్యం చేసుకోవాలంటూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము(President Murmu)కు లేఖ రాశారు. ఎన్నికల ప్రచారం జరుగుతున్న ప్రస్తుత తరుణంలో అన్ని పార్టీల స్టార్‌ క్యాంపెయినర్లకు సమ ప్రాధాన్యం ఉండేలా చూడాలని కోరారు. సోమవారం రోజు జార్ఖండ్‌లోని గర్హ్వ, చైబాస ప్రాంతాల్లో ప్రధాని మోడీ పర్యటించారు. దీంతో ఆయా ప్రాంతాలను నో ఫ్లై జోన్‌‌లుగా ప్రకటించారు. దీంతో అక్కడ సీఎం హేమంత్ సోరెన్‌ పర్యటనకు అవాంతరం కలిగింది. ఆయన హెలికాప్టర్‌ టేకాఫ్‌‌‌కు సాధారణం కంటే ఎక్కువ టైం పట్టింది.

సీఎం సోరెన్‌ సోమవారం మధ్యాహ్నం 1.45 గంటలకు గుద్రి ప్రాంతంలో సమావేశం ముగిసిన అనంతరం.. మధ్యాహ్నం 2.25 గంటలకు సిమ్‌డేగాలోని బజార్ తాండ్‌లో ప్రసంగించాల్సి ఉంది. అయితే ఎన్నికల ర్యాలీలో ప్రసంగించేందుకు ప్రధాని మోడీ మధ్యాహ్నం 2.40 గంటలకు చైబాసా ప్రాంతానికి చేరుకోవాల్సి ఉంది. దీంతో ప్రధానమంత్రి భద్రతా ప్రొటోకాల్‌ దృష్ట్యా 50 కి.మీ పరిధిలోని ప్రాంతాన్ని 15 నిమిషాల పాటు నో ఫ్లై జోన్‌గా ప్రకటించారు. ఈ కారణం వల్లే సోరెన్‌ హెలికాప్టర్‌ టేకాఫ్‌కు అనుమతి లభించడంలో జాప్యం జరిగిందని రాష్ట్రపతికి పంపిన లేఖలో జేఎంఎం అధికార ప్రతినిధి సుప్రియో భట్టాచార్య పేర్కొన్నారు.

Advertisement

Next Story