భారత్ ఎన్నికలపై వెస్టర్న్ మీడియాకు జైశంకర్ కౌంటర్

by S Gopi |
భారత్ ఎన్నికలపై వెస్టర్న్ మీడియాకు జైశంకర్ కౌంటర్
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి వెస్టర్న్ మీడియా అనుసరిస్తున్న తీరుపై మనదేశ విదేశాంగ మంత్రి జైశంకర్ ఘాటుగా స్పందించారు. ఎన్నికల తర్వాత ఫలితాల కోసం కోర్టులకు వెళ్లే వారుసైతం భారత్‌కు హితబోధ చేస్తున్నారని, ఎన్నికలను ఎలా నిర్వహించాలో భారత్‌కు హితబోధ చేయనవసరంలేదని కౌంటర్ ఇచ్చారు. సుమారు 200 ఏళ్ల పాటు ప్రపంచంపై పెత్తనం కలిగిన ఆ దేశాలు, ఆ మనస్తత్వాన్ని వదులుకోలేకపోతున్నాయి. భారత్ వారిని పట్టించుకోకపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాయి. ఒక వర్గం వారే పాలనలో ఉండాలని వెస్టర్న్ మీడియా కోరుకుంటోంది. భారత్‌లో అది జరగకపోవడంతో అసహనానికి గురవుతున్నాయి. వారు అనుకున్నట్టు లేకపోతే దుష్ప్రచారం చేస్తున్నాయని, దేశ ప్రతిష్ఠను తగ్గించే ప్రయత్నాలు చేస్తూ మైండ్ గేమ్ కొనసాగించడాన్ని జైశంకర్ తీవ్రంగా ఎండగట్టారు. కాగా, ఇటీవల అంతర్జాతీయ మీడియా భారత్‌లో ఎన్నికలపై ప్రతికూల కథనాలు వెలువరించాయి. అధిక ఎండలు ఉన్న వేళ భారత్‌లో ఎన్నికలు జరుగుతున్నాయని, ఎన్నికలు సజావుగా, స్వేచ్ఛాయుతంగా సాగుతాయని ఆశిస్తున్నట్టు వార్తలు ఇచ్చాయి. ఇవికాకుండా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్, కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల వ్యవహారం వంటి అంశాలపై విమర్శలు చేశాయి. ఈ క్రమంలోనే జైశంకర్ వెస్టర్న్ మీడియాకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed