గుండెపోటుతో గ్యాంగ్ స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి

by Dishanational6 |
గుండెపోటుతో గ్యాంగ్ స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్‌- రాజకీయనాయకుడు ముఖ్తార్ అన్సారీ మృతిచెందాడు. బందాలోని రాణిదుర్గావతి మెడికల్ కాలేజ్ లో చికిత్స పొందుతూ చనిపోయాడు.ముఖ్తార్ గుండెపోటుతో చనిపోయినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. రంజాన్ మాసం సందర్భంగా సాయంత్రం ఉపవాసం విరమించిన తర్వాత ముఖ్తార్ అన్సారీ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడని అధికారులు తెలిపారు. మొదట జైలులోనే చికిత్స చేసేందుకు డాక్టర్లను పిలిచారు అధికారులు. హార్ట్ ఎటాక్ రావడంతో హాస్పిటల్ కు ముఖ్తార్ ను తరలించారు. రాత్రి 8.25 నిమిషాలకు అపస్మారక స్థితిలో ఉన్న ముఖ్తార్ ను హాస్పిటల్ కు తరలించారు. తొమ్మిది మంది డాక్టర్ల బృందం ట్రీట్మెంట్ చేసినప్పటికీ.. ముఖ్తార్ చనిపోయారు.

కొద్ది రోజుల క్రితం ముఖ్తార్ అన్సారీ తన ప్రాణాలకు ముప్పు ఉందని పేర్కొన్నాడు. ముక్తార్ అన్సారీ తనపై విషం ‍ప్రయోగించేందుకు కుట్ర జరుగుతున్నదంటూ కోర్టుకు విన్నవించుకున్నాడు. ఆ తర్వాతే ఈనెల 26న అస్వస్థతతో హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత డిశ్చార్జి అయ్యాడు. అన్సారీకి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. అతడికి శస్త్రచికిత్స చేయాలని అప్పుడే వైద్యులు సూచించారు.

ముఖ్తార్ మృతి పట్ల సమాజ్ వాదీ పార్టీ సంతాపం ప్రకటించింది. ‘మాజీ ఎమ్మెల్యే ముఖ్తార్ అన్సారీ మృతి చెందడం విచారకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం. మృతుడి కుటుంబ సభ్యులకు శక్తి ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాం’ అని సమాజ్ వాదీ పార్టీ ఎక్స్ అకౌంట్ లో పేర్కొంది.

ఇకపోతే ఘాజీపూర్ నకిలీ ఆయుధాల లైసెన్స్ కేసులో ముఖ్తార్ అన్సారీకి కోర్టు జీవిత ఖైదు విధించింది. 2023లో జరిగిన హత్య కేసులోనూ ముఖ్తార్ అన్సారీకి కోర్టు జీవిత ఖైదు విధించింది. ముఖ్తార్ కు ఇప్పటివరకు ఏడు కేసుల్లో శిక్ష పడింది. ఎనిమిదో కేసులో దోషిగా తేలాడు.


Next Story