గాయాలైనా.. వాహనం బ్యానెట్ కు కట్టేసి తీసుకెళ్లిన ఇజ్రాయెల్ సైనికులు

by Shamantha N |
గాయాలైనా.. వాహనం బ్యానెట్ కు కట్టేసి తీసుకెళ్లిన ఇజ్రాయెల్ సైనికులు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్‌ సైనికులు అమానవీయ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాలస్తీనా వెస్ట్ బ్యాంక్ లోని జెనిన్ నగరంలో పాలస్తీనా పౌరుడితో ఇజ్రాయెల్ సైన్యం దారుణంగా ప్రవర్తించింది. మిలటరీ వాహనం బ్యానెట్‌కు కట్టేసి, చిన్నపాటి సందుల గుండా తీసుకెళ్లారు. ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. దీంతో, తమ సైనికులు నిబంధనలను అతిక్రమించారని ఇజ్రాయెల్‌ ఆర్మీ ప్రకటన విడుదల చేసింది. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పింది. వెస్ట్‌బ్యాంక్‌లో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌ జరిగిందని తెలిపింది. మిలిటెంట్లకు, ఆర్మీకి మధ్య ఎదురుకాల్పులు జరిగాయని.. అప్పుడే ఆ వ్యక్తికి గాయాలయ్యాయని ఆర్మీ తన ప్రకటనలో పేర్కొంది. ఆ వ్యక్తిని పాలస్తీనా మిలిటెంట్‌గా అనుమానిస్తున్నామని వెల్లడించింది.

నిబంధనల ఉల్లంఘన సరికాదు..

ఈ ఘటనపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ స్పందించింది. మిలటరీ ఉన్నతాధికారుల ఆదేశాలు, ఆపరేషన్ నిబంధనలు ఉల్లంఘించడం సరికాదంది. అనుమానితుడ్ని ఇజ్రాయెల్ బలగాలు కట్టేసి అలా తీసుకెళ్లడం తప్పని పేర్కొంది. గాయాలైన వ్యక్తిని చికిత్స కోసం పాలస్తీనియన్‌ రెడ్‌ క్రిసెంట్‌కు తరలించినట్లు తెలిపింది. గతేడాది అక్టోబర్‌ 7న ఇజ్రాయెల్‌పై హమాస్‌ ఉగ్రవాదుల మారణహోమంతో మొదలైన యుద్ధం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధంలో 1,194 మంది చనిపోయినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. గాజా ఆరోగ్యశాఖ తెలిపిన వివరాల ప్రకారం మృతుల సంఖ్య 37వేల మందికి పైగా ఉంటుందని అంచనా.

Advertisement

Next Story