Isha Foundation: విచారణపై స్టే.. సుప్రీంకోర్టులో ఈశా ఫౌండేషన్ కు బిగ్ రిలీఫ్

by Y.Nagarani |
Isha Foundation: విచారణపై స్టే.. సుప్రీంకోర్టులో ఈశా ఫౌండేషన్ కు బిగ్ రిలీఫ్
X

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ యోగా గురు జగ్గీ వాసుదేవ్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈశా ఫౌండేషన్ (Isha Foundation) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. జగ్గీ వాసుదేవ్ (jaggi vasudev) మహిళలను సన్యాసినులుగా మారడానికి ప్రేరేపిస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటోంది ఈశా ఫాండేషన్. మద్రాసు హైకోర్టు.. తమిళనాడు పోలీసుల్ని ఫాండేషన్ పై విచారణ జరిపి వివరాలను సమర్పించాలని ఆదేశించడాన్ని సుప్రీంకోర్టు (Supreme Court)లో సవాల్ చేసింది. దీనిపై విచారణ చేసిన సుప్రీం ధర్మాసనం.. ఆశ్రమంలో పోలీసుల విచారణ ఆపాలని పేర్కొంటూ స్టే విధించింది. ఇప్పటి వరకూ చేసిన దర్యాప్తుకు సంబంధించిన వివరాలను తమకు సమర్పించాలని ఆదేశించింది. ఫౌండేషన్ పై చర్యలకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చేంతవరకూ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడానికి వీల్లేదని స్పష్టం చేసింది.

కోయంబత్తూరు(coimbatore)లో ఈశా యోగా కేంద్రం(Isha Yoga Center)లో ఉన్న తన ఇద్దరు కుమార్తెలను తమకు అప్పగించాలని కోరుతూ.. కోయంబత్తూరు వ్యవసాయ యూనివర్శిటీ విశ్రాంత ప్రొఫెసర్ కామరాజ్ మద్రాసు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ ను దాఖలు చేశారు. తమ కూతుర్లు గీత, లత యోగా నేర్చుకునేందుకు వెళ్లి ఆశ్రమంలోనే ఉండిపోయారని, వాళ్లను గదిలో నిర్బంధించి చిత్రహింసలకు గురిచేస్తున్నట్లు తెలిసిందని తమ పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే తమ కుమార్తెలే తమను ఇబ్బంది పెట్టొద్దంటూ సివిల్ పిటిషన్ దాఖలు చేయడంతో మానసికంగా కుంగిపోయామని, ఫాండేషన్ కు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తే నిరాహారదీక్ష చేసి చనిపోతానని చిన్నకూతురు బెదిరించిందన్నారు.

ఈ పిటిషన్ పై మద్రాసు హైకోర్టు(Madras High Court)లో విచారణ జరగగా.. జగ్గీ వాసుదేవ్ మాత్రం తనకూతురికి పెళ్లి చేసి పంపాడని, ఇతరుల కుమార్తెలను మాత్రం సన్యాసినులుగా మారాలని ప్రేరేపిస్తున్నారని కామరాజ్ వాపోయారు. కూతుర్లను అప్పగిస్తే వారికి వేరే ఇల్లు ఇచ్చి అక్కడే ఉంచుతానని కోర్టును అభ్యర్థించారు. ఈ సమయంలో ఈశా ఫాండేషన్ తామెవ్వరినీ పెళ్లి చేసుకోవాలని కానీ, సన్యాసినులుగా మారాలని కానీ ఇబ్బంది పెట్టలేదు, పెట్టబోమని పేర్కొంది. ఆ నిర్ణయాలు పూర్తిగా వారి వ్యక్తిగతమని తెలిపింది. ఆ పిటిషనే మద్రాసు హైకోర్టు నుంచి సుప్రీంకు చేరగా.. ఫాండేషన్ నుంచి న్యాయవాది ముకుల్ రోహిత్గీ (Mukul Rohatgi) వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు.. ఆశ్రమంలో పోలీసుల చర్యలపై స్టే విధించి.. తదుపరి విచారణను అక్టోబర్ 14కు వాయిదా వేసింది.

Next Story