Khamenei : నెతన్యాహుకు మరణశిక్ష విధించి ఉండాల్సింది : ఇరాన్ సుప్రీం నేత ఖమేనీ

by Hajipasha |
Khamenei : నెతన్యాహుకు మరణశిక్ష విధించి ఉండాల్సింది : ఇరాన్ సుప్రీం నేత ఖమేనీ
X

దిశ, నేషనల్ బ్యూరో : ఇజ్రాయెల్‌(Israel) ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు(Benjamin Netanyahu), మాజీ రక్షణ మంత్రి యోవ్ గ్యాలెంట్‌లపై ఇటీవలే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) అరెస్టు వారెంట్ జారీ చేసింది. దీనిపై స్పందిస్తూ ఇరాన్(Iran) సుప్రీంనేత ఆయతుల్లా అలీ ఖమేనీ(Khamenei) కీలక వ్యాఖ్యలు చేశారు. అమానుష దాడులతో గాజాలో 44వేల మందిని బలిగొన్నందుకు నెతన్యాహు, యోవ్ గ్యాలెంట్‌‌లకు ఐసీసీ మరణ శిక్ష విధించి ఉండాల్సిందని ఆయన కామెంట్ చేశారు. అలాంటి క్రూరమైన నేరగాళ్లకు అరెస్టు వారెంట్‌ ఒక్కటే సరిపోదన్నారు. సోమవారం ఇరాన్‌లోని తెహ్రాన్‌లో బసిజ్‌ పారా మిలిటరీ ఫోర్స్‌ను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఖమేనీ ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘మన శత్రువు (ఇజ్రాయెల్) గాజా, లెబనాన్‌లలో విజయం సాధించలేడు. ఆ రెండుచోట్లా సామాన్య ప్రజల ఇళ్లపై బాంబులు జారవిడిచి ఇజ్రాయెల్ విజయం సాధించినట్టుగా చెప్పుకుంటోంది. వాళ్లు మూర్ఖులు. ప్రజల ఇళ్లు, వైద్యశాలలు, కమ్యూనిటీలపై బాంబులు వేస్తే గెలిచినట్టు కాదు.. నేరం చేసినట్టు. ఈ నేరానికి అరెస్టు వారెంట్‌ సరిపోదు. నెతన్యాహు, గ్యాలెంట్‌‌లకు కచ్చితంగా మరణశిక్ష విధించాలి’’ అని ఖమేనీ వ్యాఖ్యానించారు. కాగా, ఇటీవలే ఐసీసీ జారీ చేసిన అరెస్టు వారెంట్‌ను ఇజ్రాయెల్ తిరస్కరించింది. తాము గాజాలో యుద్ధనేరాలకు పాల్పడలేదని తెలిపింది.

Advertisement

Next Story