America : అమెరికాలో ఆసక్తికర పరిణామం..ట్రంప్ తో బైడెన్ భేటీ

by Y. Venkata Narasimha Reddy |
America : అమెరికాలో ఆసక్తికర పరిణామం..ట్రంప్ తో బైడెన్ భేటీ
X

దిశ, వెబ్ డెస్క్ : అమెరికా(America) రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. వైట్ హౌస్ వేదికగా నూతన అధ్యక్షుడిగా ఎంపికైన డోనాల్డ్ ట్రంప్(Donald Trump) తో ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ( Joe Biden)భేటీ అయ్యారు. వారిద్ధరి అరుదైన భేటీ ఆ దేశ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. తమ భేటీలో ట్రంప్, బైడెన్ అధికార మార్పిడి సజావుగా సాగే విషయంపై చర్చించారు. అధికార మార్పిడితో పాటు దేశ ప్రయోజనాల పరిరక్షణలో పరస్పరం సహకరించుకోవాలని వారు నిర్ణయించుకున్నట్లుగా వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి. రిపబ్లికన్, డెమోక్రట్ నేతల మధ్య హోరాహోరీగా సాగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో.. డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు.

అధ్యక్ష ఎన్నికల ఫలితాల తర్వాత.. గెలిచిన వారితో అధ్యక్షుడు భేటీ కావడం ఆనవాయితీగా కొనసాగుతోంది. అయితే, 2020లో ఎన్నికల్లో ఓడిపోయిన డొనాల్డ్ ట్రంప్.. విజయం సాధించిన జో బైడెన్ ను వైట్ హౌస్ కు ఆహ్వానించలేదు. అంతేకాకుండా బైడెన్ బాధ్యతలు చేపట్టే కార్యక్రమానికీ హాజరుకాలేదు. అయినప్పటికీ.. బైడెన్ మునుపటి సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ట్రంప్ నకు ఆహ్వానం పంపారు. ఈ మేరకు వైట్ హౌస్ లో ఏర్పాటు చేసిన భేటీకి కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు ట్రంప్ పాల్గొనడం విశేషంగా మారింది.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తన ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు ముమ్మరం చేశారు. అందులో భాగంగా తన గెలుపులో కీలక పాత్ర పోషించిన బిలియనీర్ ఎలాన్ మస్క్ (Elon musk), వివేక్ రామస్వామి (Vivek Ramaswamy)లకు ఎఫిషియెన్సీ శాఖ బాధ్యతలు అప్పగించారు.

Advertisement

Next Story