'భారత అంతరిక్ష ప్రయాణం.. ప్రధాని నెహ్రూ ఎంతగానో మద్దతిచ్చారు'

by Vinod kumar |
భారత అంతరిక్ష ప్రయాణం.. ప్రధాని నెహ్రూ ఎంతగానో మద్దతిచ్చారు
X

న్యూఢిల్లీ : తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ అందించిన ప్రోత్సాహంతో 1962లో ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ (INCOSPAR) ఆవిర్భవించి భారత అంతరిక్ష యాత్రకు బీజాలు వేసిందని కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ అన్నారు. హోమీ బాబా, విక్రమ్ సారాభాయ్‌ల దూరదృష్టి అందిస్తున్న ఫలితాలను ఇప్పుడు యావత్ దేశం చూస్తోందని పేర్కొన్నారు. చంద్రయాన్ స్పేస్ మిషన్ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలోనే ప్రారంభమైందని గుర్తు చేశారు. తదుపరిగా ఏర్పడిన ప్రభుత్వాలు.. కేవలం ఆ మిషన్ ను ముందుకు తీసుకెళ్లాయని ఆయన చెప్పారు. చంద్రయాన్ 3 ల్యాండింగ్ సందర్భంగా జైరాం రమేష్ ఈమేరకు ఓ ట్వీట్ చేశారు. INCOSPAR ఏర్పాటుకు సంబంధించిన 1962 నాటి ఒక న్యూస్ పేపర్ క్లిప్‌ను అందులో షేర్ చేశారు.

1971 డిసెంబర్ 25న విక్రమ్ సారాభాయ్ హఠాన్మరణంతో ఇస్రో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొందని తన పోస్ట్‌లో ప్రస్తావించారు. సతీష్ ధావన్ ప్రవేశంతో ఇస్రో రూపురేఖలు ఎలా మారాయనే దానిపై తన పుస్తకం ‘ఇంటర్‌ట్వైన్డ్ లైవ్స్: పీ ఎన్ హస్కర్ & ఇందిరా గాంధీ’లో వివరించానని తెలిపారు. కాగా, ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో పార్టీ నేత రాజీవ్‌ శుక్లా మీడియాతో మాట్లాడుతూ.. చంద్రయాన్‌-3 విజయాన్ని బీజేపీ మాత్రమే క్లెయిమ్ చేసుకోవడం సరికాదన్నారు. 2014కి ముందు కూడా భారతదేశం ఉందని, ప్రధానమంత్రులందరి సహకారం కూడా చంద్రయాన్‌లో ఉందని కామెంట్ చేశారు. అటల్ బిహారీ వాజ్‌పేయి చేసిన కృషిని కూడా బీజేపీ గుర్తించడం లేదని ఆరోపించారు.

Advertisement

Next Story