లిపులేఖ్ పాస్ మార్గాన్ని తిరిగి ప్రారంభించాలని భారతీయ వ్యాపారుల డిమాండ్

by S Gopi |
లిపులేఖ్ పాస్ మార్గాన్ని తిరిగి ప్రారంభించాలని భారతీయ వ్యాపారుల డిమాండ్
X

దిశ, నేషనల్ బ్యూరో: చైనాతో సరిహద్దు వాణిజ్యం చేస్తున్న భారతీయ వ్యాపారులు ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్ జిల్లాలో ఉన్న మార్గాన్ని తెరవాలని, తద్వారా సరిహద్దు వాణిజ్యాన్ని పునఃప్రారంభించే అంశాని పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. జిల్లాలోని లిపులేఖ్ పాస్ ద్వారా భారత వ్యాపారులు 1992 నుంచి సరిహద్దు వాణిజ్యాన్ని నిర్వహిస్తున్నారు. అయితే, 2019లో కొవిడ్-19 మహమ్మారి కారణంగా ఆ మార్గాన్ని అకస్మాత్తుగా మూసేశారు. దాంతో భారతీయ వ్యాపారులు తమ ఉన్ని ఉత్పత్తులను వదిలి టిబెట్‌లోని తక్లాకోట్ మార్ట్ ద్వారా వచ్చేశారు. ఇప్పటికి ఐదేళ్లు గడిచిన లిపులేఖ్ మార్గాన్ని తెరవలేదని దార్చులాలోని సరిహద్దు వ్యాపారుల సంఘం తెలిపింది. ఇటీవల నేపాల్‌తో 14 వాణిజ్య పాస్‌లను తెరిచేందుకు చైనా అంగీకరించిన నేపథ్యంలో భోటియా తెగకు చెందిన భారత వ్యాపారులు లిపులేఖ్ వాణిజ్య మార్గాన్ని తెరవాలని డిమాండ్ చేయడం మొదలుపెట్టారు.

2022, డిసెంబర్‌లో చైనా, నేపాల్ మధ్య జరిగిన ఒప్పందం అమలు ఈ ఏడాది మే 25న ప్రారంభమైందని భారత్ టిబెటన్ సిమంత్ వ్యాపార్ సమితీ అధ్యక్షులు జీవన్ సింగ్ రోంగ్‌కాలీ చెప్పారు. లిపులేఖ్ పాస్‌ను కూడా పునఃప్రారంభించాలని భారత ప్రభుత్వానికి 22 దరఖాస్తులను పంపాము, ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదని జీవన్ సింగ్ పేర్కొన్నారు. కరోనా మూలంగా దార్చులాలో రూ. 15 లక్షల విలువైన సరుకును మేము తక్లాకోట్‌లో వదిలేశాం. అవి భద్రంగా ఉన్నాయో లేవో కూడా తెలీదు. వాటిని ప్లైవుడ్‌తో కప్పి నిల్వ చేశామని ఆయన వివరించారు. 1992 నుంచి 450 మంది భారతీయ వ్యాపారులు పశ్చిమ టిబెట్‌లోని 45కి పైగా గ్రామాలకు చెందిన వారు ఈ మార్గంలో వస్తువులను సరఫరా చేసేవారు. ఏటా 1.5 కోట్లకు పైగా వాణిజ్యం ద్వారా భారత ప్రభుత్వానికి కస్టమ్స్ సుంకం, ఇతర పన్నుల రూపంలో లక్షలు చెల్లిస్తున్నామని జీవన్ సింగ్ వెల్లడించారు.

Advertisement

Next Story