సిజేరియన్స్ కోసం భారీ క్యూ

by John Kora |   ( Updated:2025-01-23 13:25:00.0  )
సిజేరియన్స్ కోసం భారీ క్యూ
X

- జన్మతః పౌరసత్వం కోసం ఫిబ్రవరి 20 డెడ్ లైన్

- అంతకు ముందే పిల్లల్ని కనాలని పేరెంట్స్ ఆత్రుత

- సీ-సెక్షన్ కోసం ఎగబడుతున్న ఇండియన్స్

- ప్రమాదం అంటున్న డాక్టర్లు

దిశ, నేషనల్ బ్యూరో:

అమెరికాలో సిజేరియన్స్ కోసం ప్రెగ్నెంట్ విమెన్ క్యూ కడుతున్నారట. రెండు మూడు వారాల్లోగా పిల్లల్ని కనేసేయాలని ఆత్రుత పడుతున్నారట. చివరకు 7వ నెల గర్భంతో ఉన్న మహిళలు కూడా సీ-సెక్షన్ చేయించుకొని అర్జెంట్‌గా తల్లై పోవాలని ఆరాటపడుతున్నారట. అమెరికాకు రెండో సారి అధ్యక్షుడైన తర్వాత డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయమే ఇప్పుడు గర్భిణుల ఆందోళనకు కారణమైంది. ఇంత వరకు అమెరికాలో జన్మించిన పిల్లలకు జన్మతః పౌరసత్వం సంక్రమించేది. కానీ ఆ హక్కును నిరాకరిస్తూ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఎగ్జిక్యూటీవ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. ఫిబ్రవరి 20 నుంచి ఈ ఆర్డర్ అమలులోకి రానుంది. ఇక అప్పుడు అమెరికా సిటిజన్స్ కాని విదేశీయుల, అక్రమ వలసదారుల పిల్లలకు ఆటోమెటిక్‌గా సిటిజన్‌షిప్ వర్తించదు. అందుకే ఫిబ్రవరి 19లోగా పిల్లల్ని కనాలని, వారి ద్వారా అయినా అమెరికా పౌరసత్వం పొందాలని పలువురు భావిస్తున్నారు. ఇలా పిల్లల్ని త్వరగా కనాలనుకుంటున్న వారిలో అత్యధికులు భారతీయులే ఉన్నారని డాక్టర్లు చెబుతున్నారు.

ఎక్కువగా ఇండియన్సే..

డొనాల్డ్ ట్రంప్ ఎగ్జిక్యూటీవ్ ఆర్డర్ మీద సంతకం పెట్టిన తర్వాత సి-సెక్షన్స్ కోసం అనేక మంది తనకు కాల్స్ చేసినట్లు గైనకాలజిస్ట్ ఒకరు చెప్పారు. ప్రస్తుతం హెచ్1బీ, ఎల్1 వీసాల మీద వేలాది మంది ఇండియన్స్ అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారు. వీళ్లంతా యూఎస్‌లో పర్మనెంట్ రెసిడెన్సీ కోసం గ్రీన్ కార్డు అప్లయ్ చేసుకొని వేచి చూస్తున్నారు. అయితే తల్లిదండ్రులు అమెరికన్లు కాకపోయినా, గ్రీన్ కార్డ్ లేకపోయినా వారికి పుట్టే పిల్లలు ఫిబ్రవరి 20 తర్వాత జన్మతః అమెరికా పౌరసత్వానికి అనర్హులు. అందుకే ఫిబ్రవరి 19లోపే సిజేరియన్ చేయించుకోని అయినా పిల్లల్ని కనాలని చాలా మంది ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. అమెరికన్ సిటిజన్లుగా పుట్టే పిల్లలకు 21 ఏళ్లు వస్తే, వారి తల్లిదండ్రులకు అమెరికాలో జీవించడానికి అనుమతి ఉంటుంది. అందుకే ముందస్తు డెలివరీలకు డిమాండ్ పెరిగిపోయింది.

అమెరికాలో గ్రీన్ కార్డు రావడం ఇప్పుడు చాలా కష్టమే. 2007లో అమెరికాకు వచ్చి, ఉద్యోగం చేస్తున్న వారికి ఇప్పుడు గ్రీన్ కార్డుకు అర్హులు అవుతారు. అంటే ఈ మధ్యకాలంలో అమెరికాకు వచ్చిన వారికి గ్రీన్ కార్డు రావాలంటే మరో 20 ఏళ్లు ఆగాల్సిందే. గతంలో అయితే పిల్లలు పుడితే వారి ద్వారా పర్మనెంట్ రెసిడెంట్లుగా మారేవారు. కానీ ఇప్పుడు ఆ హక్కును ట్రంప్ తీసివేయడంతో.. గర్భంతో ఉన్న మహిళలు త్వరగా పిల్లలు కనేందుకు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. కాగా, ఇలా ముందస్తు ప్రసవాలు చేయించుకోవడం తల్లి, పిల్లలకు ప్రమాదమే అని అంటున్నారు.పిల్లల ఆరోగ్యంపై కూడా ప్రభావం పడుతుందని డాక్టర్లు పేర్కొంటున్నారు. శరీరంలోని అవయవాలు పూర్తిగా పెరగకుండా పుట్టడం వల్ల.. ఆ పిల్లలు జీవితాంతం బాధపడాల్సి ఉంటుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. అయితే ఎంతో ఖర్చు పెట్టి అమెరికన్ డ్రీమ్స్‌తో అడుగుపెట్టిన వారికి ఇప్పుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఆశనిపాతంలా మారింది.

Next Story