Gurpatwant Pannun : ఒక ఉగ్రవాది కేసు వేస్తే.. మమ్మల్ని ప్రశ్నిస్తారా ? అమెరికాపై భారత్ భగ్గు

by Hajipasha |
Gurpatwant Pannun : ఒక ఉగ్రవాది కేసు వేస్తే.. మమ్మల్ని ప్రశ్నిస్తారా ? అమెరికాపై భారత్ భగ్గు
X

దిశ, నేషనల్ బ్యూరో : ఖలిస్తాన్ వేర్పాటువాది గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ చాలా ఏళ్లుగా అమెరికాలోనే ఉంటున్నాడు. తనను మర్డర్ చేయించేందుకు భారత గూఢచార సంస్థ ‘రా’ కుట్ర పన్నిందంటూ అతడు దాఖలు చేసిన పిటిషన్‌ను అమెరికాలోని న్యూయార్క్ జిల్లా కోర్టు విచారించింది. దీనిపై 21 రోజుల్లోగా బదులివ్వాలని ఆదేశిస్తూ భారత ప్రభుత్వం, భారత జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్, మాజీ రా చీఫ్‌ సమంత్‌ గోయల్‌, రా ఏజెంట్ విక్రమ్‌ యాదవ్‌, భారత వ్యాపారి నిఖిల్ గుప్తాలకు సమన్లు జారీచేసింది. దీనిపై భారత ప్రభుత్వం భగ్గుమంది.

భారత గూఢచార సంస్థపై అభియోాగాలు మోపడాన్ని తప్పుపట్టింది. ‘‘పన్నూ ఒక ఉగ్రవాది. అతడి కేసులో మమ్మల్ని ప్రశ్నించడం ఏమిటి ? ఇది పూర్తిగా అసమంజసం’’ అని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ పేర్కొన్నారు. ‘‘ఈ కేసు వెనుక ఉన్న వ్యక్తి ఒక తీవ్రవాది. అతడు ప్రాతినిధ్యం వహించే ‘సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌’ సంస్థ చట్టవిరుద్ధమైనది. ఈ విషయం అందరికీ తెలుసు’’ అని ఆయన చెప్పారు. సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌ అనే ఖలిస్తాన్ వేర్పాటువాద సంస్థను 2007లో గురుపత్వంత్‌ సహా పలువురు కలిసి స్థాపించారు. భారత్‌ 2019లోనే దీన్ని బ్యాన్ చేసింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల చట్టం కింద భారత ప్రభుత్వం పన్నూను 2020లో ఉగ్రవాదిగా ప్రకటించింది.

Advertisement

Next Story

Most Viewed