India-Pak: ఎల్ఓసీ వద్ద భారత్ పాక్ సమావేశం.. కీలక అంశాలపై డిస్కషన్ !

by vinod kumar |
India-Pak: ఎల్ఓసీ వద్ద భారత్ పాక్ సమావేశం.. కీలక అంశాలపై డిస్కషన్ !
X

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూ కశ్మీర్ (Jammu Kashmir) పూంచ్ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ (LOC) వద్ద భారత్ (India), పాకిస్థాన్ (Pakisthan) సైన్యాల మధ్య శుక్రవారం ఫ్లాగ్ మీటింగ్ (Flag meeting) నిర్వహించారు. చకన్-డా-బాగ్ క్రాసింగ్ పాయింట్ ప్రాంతంలో ఈ భేటీ జరగగా ఇరు దేశాల సైన్యాలకు చెందిన బ్రిగేడియర్ స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో బార్డర్‌లో శాంతిని కాపాడుకోవడం, భవిష్యత్తులో ఉద్రిక్త ఘటనలు జరగకుండా నియంత్రించడం వంటి వాటిపై చర్చించినట్టు తెలుస్తోంది. సరిహద్దుల్లో శాంతిని కాపాడుకోవాల్సిన అవసరాన్ని ఇరు పక్షాలు నొక్కి చెప్పినట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. దాదాపు 75 నిమిషాల పాటు భేటీ కొనసాగగా సమావేశం సాధారణ వాతావరణంలోనే జరగిందని, సరిహద్దుల్లో శాంతిని కాపాడుకునేందుకు కాల్పుల విరమణ ఒప్పందాన్ని గౌరవించాలని ఇరు సైన్యాలు అంగీకరించాయని తెలిపాయి.

కాగా, గత కొన్ని రోజులుగా ఎల్‌ఓసి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈనెల 4న భారత సైన్యం ఏడుగురు పాకిస్తానీ చొరబాటుదారులను హతమార్చింది. అంతేగాక 13న కూడా పాకిస్తాన్ సైనికులు కాల్పుల విరమణను ఉల్లంఘించినట్లు పలు కథనాలు వెలువడగా వాటిని సైన్యం ఖండించింది. అంతేగాక ఫిబ్రవరి నెలలోనే అనేక కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే భారత్ పాక్ సైన్యాలు సమావేశమవడం గమనార్హం. మరోవైపు గత నాలుగేళ్లలో రెండు దేశాల మధ్య జరిగిన మొదటి సమావేశం ఇదే కావడం గమనార్హం. చివరి ఫ్లాగ్ మీటింగ్ 2021లో జరిగింది.

Advertisement
Next Story

Most Viewed