ప్రపంచంలోనే 3వ అతిపెద్ద విమానయాన మార్కెట్‌గా భారత్

by S Gopi |
ప్రపంచంలోనే 3వ అతిపెద్ద విమానయాన మార్కెట్‌గా భారత్
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద విమానయాన మార్కెట్‌గా అవతరించింది. ఈ విషయాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం పార్లమెంట్‌ ఉభయసభలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో పేర్కొన్నారు. గత పదేళ్లలో విమాన రూట్లు పెరగడంతో ముఖ్యంగా టైర్2, టైర్3 నగరాలు ఎక్కువ ప్రయోజనం పొందినట్టు రాష్ట్రపతి తెలిపారు. అలాగే, 2021 నుంచి 2024 మధ్య భారత్ ఏటా సగటున 8 శాతం వృద్ధిని సాధించిందని ప్రసంగంలో ప్రస్తావించారు. గడిచిన 10 ఏళ్లలో భారత్ 11వ స్థానం నుంచి ఐదవ అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా ఎదిగింది. ఇక, ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద విమానయాన మార్కెట్‌గా భారత్ నిలిచింది. 2014, ఏప్రిల్‌లో 209 విమానాశ్రయ రూట్లు దేశంలో ఉండగా, 2024, ఏప్రిల్ నాటికి 605కి పెరిగాయని రాష్ట్రపతి తన ప్రసంగంలో పేర్కొన్నారు. దేశంలో ఎయిర్ ట్రాఫిక్ డిమాండ్ పెరుగుతోంది. ఎయిర్‌లైన్ సంస్థలు సైతం తమ విమానాల సంఖ్యను పెంచుతున్నాయి. దేశంలో ప్రజా రవాణాను ప్రపంచంలోనే అత్యుత్తమంగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

ఇదే సమయంలో 70 ఏళ్లు పైబడిన ప్రతి భారతీయ పౌరుడికి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకం కింద ఉచిత చికిత్స అందించబడుతుందని రాష్ట్రపతి తెలిపారు. దీనికి సంబంధించి ప్రభుత్వ నిర్ణయం తీసుకోనుంది. 70 ఏళ్లు దాటిన అందరికీ ఈ పథకం కింద ఉచిత చికిత్స లభిస్తుందన్నారు. ఆయుష్మాన్ భారత్-ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన(ఏబీ-పీఎంజేఏవై) కింద ఇప్పటికే 55 కోట్ల మంది లబ్దిదారులకు చికిత్స ఆరోగ్య సేవలు అందుతున్నట్టు చెప్పారు. ఈ పథకం ప్రపంచంలోనే అతిపెద్ద పబ్లిక్ ఫండెడ్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ అని, 12 కోట్ల కుటుంబాలకు ఆసుపత్రి ఖర్చు కింద ఒక్కో కుటుంబానికి ఏటా రూ. 5 లక్షల ఆరోగ్య రక్షణ అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా ఉంది. అంతేకాకుండా దేశంలో 25 వేల జన్ ఔషధి కేంద్రాలు కూడా శరవేగంగా ప్రారంభమవుతున్నాయని ద్రౌపది ముర్ము వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed