పాక్ కంటే భారత్‌లోనే నిరుద్యోగం ఎక్కువ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ

by samatah |
పాక్ కంటే భారత్‌లోనే నిరుద్యోగం ఎక్కువ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ
X

దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్థాన్ కంటే భారత్‌లోనే నిరుద్యోగం ఎక్కువగా ఉందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ప్రధాని మోడీ అనుసరిస్తున్న విధానాలే అందుకు కారణమని విమర్శించారు. భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా మధ్య ప్రదేశ్‌లోని మోహనలో ఆదివారం జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. కేంద్రం తీసుకొచ్చిన వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ), పెద్దనోట్ల రద్దుతో చిన్న వ్యాపారాలు మూతపడ్డాయని తెలిపారు. దీంతో నిరుద్యోగం ఎక్కువైందని తెలిపారు. ‘దేశంలో గత 40ఏళ్లలో గరిష్ట నిరుద్యోగం నమోదైంది. బంగ్లాదేశ్, భూటాన్, పాకిస్థాన్‌ల కంటే భారత్‌లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. మోడీ తీసుకున్న నిర్ణయాల వల్లే ఈ పరిస్థితి తలెత్తింది’ అని ఆరోపించారు. అంతకుముందు రాహుల్ గ్వాలియర్‌లో మాజీ సైనికులు, అగ్ని వీరులతో సమావేశమయ్యారు.

ధనికుల కోసమే రైల్వే విధానాలు

యాత్రకు ముందు రాహుల్ ఎక్స్‌లో పోస్టు చేశారు. ధనవంతులను దృష్టిలో ఉంచుకునే కేంద్ర భారతీయ రైల్వే విధానాలను రూపొందిస్తుందని పేర్కొన్నారు. ‘ఏటా 10 శాతం చార్జీల పెంపు, డైనమిక్ చార్జీల పేరుతో దోచుకోవడం, ఖరీదైన ప్లాట్‌ఫారమ్ టిక్కెట్ల మధ్య పేదలు అడుగు కూడా వేయలేని పరిస్థితి నెలకొంది. కానీ ఎలైట్ రైలు చిత్రాన్ని చూపించి ప్రజలు మభ్య పెడుతున్నారు’ అని తెలిపారు. ‘ఏసీ కోచ్‌ల సంఖ్యను పెంచేందుకు జనరల్ బోగీలను తగ్గిస్తున్నారు. ఫలితంగా రైతులు, విద్యార్థులు, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు’ అని తెలిపారు. పేద, మధ్యతరగతి ప్రయాణికులకు రైల్వేలో ప్రాధాన్యత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వే బడ్జెట్‌ను ప్రత్యేకంగా ప్రవేశపెట్టే సంప్రదాయానికి ముగింపు పలకడంతోనే రైల్వేలో దోపిడీ జరుగుతుందని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed