Apple : యాపిల్‌ నుంచి విపక్ష నేతల ఐఫోన్లకు ఆ మెసేజ్‌లు.. కేంద్రం రియాక్షన్

by Hajipasha |   ( Updated:2024-07-26 13:34:37.0  )
Apple : యాపిల్‌ నుంచి విపక్ష నేతల ఐఫోన్లకు ఆ మెసేజ్‌లు.. కేంద్రం రియాక్షన్
X

దిశ, నేషనల్ బ్యూరో : గతేడాది చివర్లో పలువురు విపక్ష నేతల ఐఫోన్లకు యాపిల్ కంపెనీ నుంచి వచ్చిన అలర్ట్ మెసేజ్‌లు దుమారం రేపాయి. ‘‘భారత ప్రభుత్వం స్పాన్సర్ చేసిన సైబర్ దాడి మీ ఐఫోన్లపై జరిగే ముప్పు ఉంది’’ అని ఆ మెసేజ్‌లలో ఉండటం అప్పట్లో కలకలం రేపింది. తాజాగా ఇదే అంశాన్ని ఆప్‌ ఎంపీ రాఘవ్ చద్దా రాజ్యసభలో లేవనెత్తారు. ఆనాడు విపక్షనేతలను ఆందోళనకు గురిచేసిన ఆ అలర్ట్ మెసేజ్‌ల వ్యవహారంపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని చద్దా ప్రశ్నించారు. అప్పట్లో సైబర్ దాడి బారినపడిన విపక్ష నేతల వివరాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు. దీనికి కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయమంత్రి జితిన్ ప్రసాద్ బదులిస్తూ.. ఈ అంశంపై యాపిల్ కంపెనీతో భారత ప్రభుత్వానికి చెందిన కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సీఈఆర్‌టీ -ఐఎన్) టచ్‌లో ఉందన్నారు.

ఏ ఒక్క ప్రతిపక్ష నేతకు చెందిన ఐఫోన్ కూడా ఇప్పటివరకు సైబర్ దాడికి గురికాలేదని ఆయన స్పష్టం చేశారు. ‘‘ఏ సమాచారం ఆధారంగా భారత్‌లోని విపక్ష నేతలకు హ్యాకింగ్ అలర్ట్ మెసేజ్‌లను పంపారు ? ప్రభుత్వ ప్రాయోజిత సైబర్ దాడి జరిగే అవకాశం ఉందనే ప్రస్తావన ఎందుకు చేయాల్సి వచ్చింది ? అనే సమాచారాన్ని యాపిల్ నుంచి పొందే ప్రయత్నం చేస్తున్నాం. ఆ సమాచారం అందగానే భారత దర్యాప్తు సంస్థలు తగిన చర్యలు తీసుకుంటాయి’’ అని కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద్ వెల్లడించారు. అప్పట్లో ఐఫోన్లకు ఈ తరహా మెసేజ్ వచ్చిన ప్రముఖుల జాబితాలో శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియాంకా చతుర్వేది, తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన మహువా మొయిత్రా, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా, మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ, కాంగ్రెస్‌ నేత శశి థరూర్, కాంగ్రెస్ నేత పవన్ ఖేరా తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed