అలా చేస్తే సల్మాన్‌ను క్షమిస్తాం..బిష్ణోయ్ సంఘం కీలక ప్రకటన

by samatah |
అలా చేస్తే సల్మాన్‌ను క్షమిస్తాం..బిష్ణోయ్ సంఘం కీలక ప్రకటన
X

దిశ, నేషనల్ బ్యూరో: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కృష్ణ జింకల వేట కేసు వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసులో సల్మాన్ తరఫున అతని మాజీ ప్రేయసి సోమీ అలీ ఇటీవల క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే. అయితే దీనిపై అఖిల భారత బిష్ణోయ్ మహాసభ జాతీయ అధ్యక్షుడు దేవేంద్ర బుడియా స్పందించారు. సల్మాన్ మాత్రమే స్వయంగా క్షమాపణ చెప్పాలని అలా అయితేనే బిష్ణోయ్ సమాజం వాటిని పరిగణనలోకి తీసుకుంటుందని తెలిపారు. ఆయన తరఫున మరెవరూ సారీ చెప్పాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ‘మా కమ్యూనిటీ ప్రజలు కృష్ణ జింకను దైవంగా చూస్తారు. అలాంటి వాటిని తన వినోదం కోసం సల్మాన్‌ వేటాడి చంపాడు. ఈ కేసులో అతడు నిందితుడని తేలింది. అలాంటి వ్యక్తిని మా కమ్యూనిటీ ఎప్పటికీ క్షమించదు’ అని పేర్కొన్నారు. ‘సల్మాన్ ఖాన్ బిష్ణోయ్ కమ్యూనిటీ గుడికి వచ్చి స్వయంగా క్షమాపణలు చెప్పాలి. అంతేగాక అలాంటి తప్పు మరెప్పుడూ చేయబోనని, వన్యప్రాణులను, పర్యావరణాన్ని రక్షించడానికి కృషి చేస్తానని ప్రమాణం చేయాలి. అలా చేసినప్పుడు మాత్రమే సల్మాన్‌ను క్షమించాలా వద్దా అన్న విషయంపై ఆలోచిస్తాం’ అని తెలిపారు. బిష్ణోయ్ సంఘం 29 డిమాండ్లలో క్షమాపణ కూడా ఒకటని గుర్తు చేశారు.

కాగా, 1999లో హమ్ సాథ్ సాథ్ హై చిత్రం షూటింగ్ సందర్భంగా రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ సమీపంలో సల్మాన్ కృష్ణ జింకలను వేటాడి చంపినట్టు ఆరోపణలు ఉన్నాయి. దీంతో సల్మాన్, హీరోయిన్లు టబు, సోనాలి బింద్రే సహా మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 2018లో దీనిపై విచారణ జరగగా సల్మాన్ దోషిగా తేలాడు. ఐదేళ్ల జైలు శిక్ష సైతం పడింది. అయితే కేసులో శిక్ష పడినప్పటికీ సల్మాన్ బెయిల్ పై బయటకు వచ్చాడు. అప్పటి నుంచి బిష్ణోయ్ కమ్యూనిటీ సల్మాన్‌పై ఆగ్రహంతో ఉంది. సల్మాన్‌ను ఇదే విషయమై పలుమార్లు బెదిరించారు. గత నెలలోనూ దుండగులు అతని ఇంటిపై కాల్పులు జరిపారు.

Advertisement

Next Story