'ఆత్మ గౌరవం విషయంలో రాజీ పడలేను'.. బాంబే హైకోర్టు జడ్జి రాజీనామా

by Vinod kumar |
ఆత్మ గౌరవం విషయంలో రాజీ పడలేను.. బాంబే హైకోర్టు జడ్జి రాజీనామా
X

నాగ్‌పూర్: బాంబే హైకోర్టు న్యాయమూర్తి రోహిత్ డియో తన పదవికి శుక్రవారం కోర్టు హాల్‌లోనే రాజీనామా ప్రకటించి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేసినట్లు ప్రకటించిన ఆయన ఆత్మగౌరవం విషయంలో రాజీ పడలేనంటూ నర్మగర్భంగా మాట్లాడారు. ఆయన రాజీనామా చేసిన సమయంలో కోర్టు హాల్‌లో ఉన్న న్యాయవాది చెప్పిన ప్రకారం జస్టిస్ డియో కోర్టు హాల్‌లో రాజీనామా ప్రకటన చేస్తూ.. ‘నా ఆత్మగౌరవానికి వ్యతిరేకంగా పని చేయలేను. మీరు బాగుపడాలని నేను కోరుకుంటున్నాను. మీలో ఎవరినీ బాధపెట్టకూడదనుకుంటున్నాను. ఎందుకంటే మీరంతా నా కుటుంబ సభ్యుల వంటి వారు. మీలో ప్రతి ఒక్కరికి క్షమాపణలు చెబుతున్నాను. మీరు కష్టపడి పనిచేయండి’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు.

తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేశానని, తన రాజీనామా లేఖను రాష్ట్రపతికి పంపినట్లు తెలిపారు. మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జి.ఎన్. సాయిబాబాను జస్టిస్ డియో 2022లో నిర్దోషిగా ప్రకటించారు. ఆయనకు విధించిన జీవిత ఖైదును రద్దు చేశారు. ఆ ఉత్తర్వుపై స్టే విధించిన సుప్రీం కోర్టు ఈ కేసును మళ్లీ విచారించాలని హైకోర్టులోని నాగ్‌పూర్ బెంచ్‌ను ఆదేశించింది. మైనర్ ఖనిజాల అక్రమ తవ్వకాలకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వ తీర్మానంపై జస్టిస్ డియో జనవరి 3వ తేదీన స్టే విధించారు. జస్టిస్ డియో బాంబో హైకోర్టు న్యాయమూర్తిగా 2017లో నియమితులయ్యారు. ఆయన 2025 డిసెంబర్‌లో పదవీ విరమణ చేయాల్సి ఉంది. 2016లో మహారాష్ట్ర అడ్వకేట్ జనరల్‌గా కూడా ఆయన పని చేశారు.

Advertisement

Next Story

Most Viewed