Hunger strike: డిమాండ్లు నెరవేర్చాల్సిందే.. మమతా విజ్ఞప్తిని నిరాకరించిన బెంగాల్ వైద్యులు

by vinod kumar |
Hunger strike: డిమాండ్లు నెరవేర్చాల్సిందే.. మమతా విజ్ఞప్తిని నిరాకరించిన బెంగాల్ వైద్యులు
X

దిశ, నేషనల్ బ్యూరో: కోల్‌కతాలోని ఆర్జీకర్ ఆస్పత్రిలో జరిగిన లైంగిక దాడి ఘటనను నిరసిస్తూ ఆమరణ దీక్ష చేపట్టిన జూనియర్ డాక్టర్లు దీక్ష విరమించి చర్చలకు రావాలని సీఎం మమతా బెనర్జీ చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చారు. తమ డిమాండ్లన్నీ నెరవేర్చేవరకు దీక్ష విరమించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అయితే సోమవారం ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు అంగీకరించారు. దీంతో16వ రోజూ జూనియర్ డాక్టర్ల దీక్ష కొనసాగుతోంది. మరణించిన తమ సహోద్యోగికి న్యాయం చేయాలని, రాష్ట్రంలోని ఆరోగ్య కేంద్రాల్లో మౌలిక సదుపాయాల్లో వ్యవస్థాగతమైన మార్పులు తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు.

కాగా, అంతకుముందు సీఎం మమతా బెనర్జీ వైద్యులకు ఫోన్ చేసి మాట్లాడారు. దీక్ష విరమించాలని మీ డిమాండ్లు నెరవేర్చేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని విజ్ఞప్తి చేశారు. సమస్యలు పరిష్కరించేందుకు 3 నుంచి నాలుగు నెలల సమయం ఇవ్వాలని కోరారు. చీఫ్ సెక్రటరీ మనోజ్ పంత్ సైతం వైద్యులను కలిసి మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే మమతా విజ్ఞప్తిని వైద్యులు నిరాకరించి దీక్ష కొనసాగించారు. మరోవైపు ఇప్పటివరకు, నిరాహారదీక్షలో ఉన్న ఆరుగురు వైద్యులు ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రిలో చేరగా, మరో ఎనిమిది మంది నిరవధిక నిరాహార దీక్షను కంటిన్యూ చేస్తున్నారు.

Advertisement

Next Story