యూపీ పరీక్ష పేపర్ లీకేజీలో భారీ కుట్ర

by S Gopi |
యూపీ పరీక్ష పేపర్ లీకేజీలో భారీ కుట్ర
X

దిశ, నేషనల్ బ్యూరో: ఓవైపు మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నీట్‌లో పేపర్ లీక్ అయిన వ్యవహారం దేశవ్యాప్తంగా పెను దుమారం రేపుతుంటే.. పోలీసుల విచారణలో మరో లీకైన పరీక్షకు సంబంధించిన భారీ కుట్ర బయటపడింది. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ఉత్తరప్రదేశ్‌లో జరిగిన రివ్యూ ఆఫీసర్, అసిస్టెంట్ రివ్యూ ఆఫీసర్ పోస్టుల అర్హత పరీక్ష పేపర్ లీకేజీ బహిర్గతం అయింది. ఈ పేపర్ లీకేజీకి సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నలుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు ఆ పేపర్‌ను లీక్ చేశారని స్పష్టమైంది. మొదట అధికారులు పేపర్ లీకేజీ జరగలేదని చెప్పినప్పటికీ టాస్క్‌ఫోర్స్ చేపట్టిన దర్యాప్తులో తాజాగా అసలు విషయాలు బయటపడుతున్నాయి. అధికారుల దర్యాప్తులో రెండు చోట్ల పేపర్ లీక్ అయినట్టు తేలింది. ప్రయాగ్‌రాజ్‌లో ఉన్న బిషప్ జాన్సన్ గర్ల్స్ హైస్కూల్ సెంటర్‌లో పరీక్ష ప్రారంభం అయ్యేందుకు 4 గంటల ముందు ప్రశ్నాపత్రం బయటకు వచ్చింది. యశ్వంత్, అర్పిత్ అనే ఇద్దరు పేపర్ల ఫోట్లు తీసి కొంతమంది అభ్యర్థులకు పంపించారు. దీంతో వారిద్దరితో పాటు మరికొంతమందిని పోలీసులు అరెస్ట్ చేశారు. దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని పోలీసు అధికారులు వెల్లడించారు.

మరోచోట ప్రింటింగ్ సెంటర్ నుంచి కూడా ప్రశ్నాపత్రం లీక్ అయినట్టు అధికారులు గుర్తించారు. ఇందులో రాజీవ్ నారాయణ్, సునీల్, విశాల్, సుభాష్‌లుగా గుర్తించారు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్ సమీపంలో ఉన్న ఓ ప్రింటింగ్ సెంటర్‌లో ప్రశ్నాపత్రాలను ముద్రిస్తున్నట్టు కీలక నిందితుడు రాజీవ్ నారాయణ్‌కు తెలిసింది. దాంతో ఎలాగైన ప్రశ్నాపత్రాన్ని లీక్ చేయాలని భావించి తన స్నేహితుడు విశాల్‌ను సహాయంతో ప్రింటింగ్ సెంటర్‌లో పనిచేసే సునీల్‌ను మభ్యపెట్టి లీక్ చేశారు. అదేవిధంగా కన్సల్టెన్సీలో పనిచేసే సుభాష్, విశాల్, ప్రకాష్‌లతో కలిసి ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులకు అందించారు. ఆర్ఓ, ఏఆర్‌వో ప్రశ్నాపత్రం ప్రింటింగ్ కోసం వచ్చిన వెంటనే సునీల్ సహా మిగిలిన ముగ్గురు రూ. 10 లక్షల వరకు డబ్బులు డిమాండ్ చేశారు. అంతేకాకుండా సోషల్ మీడియా ద్వారా విషయం బయటపడుతుందని భావించి ఫోటోలు తీయకూడదని అభ్యర్థులకు సూచించారు.

ఇదే సమయంలో ఈ వ్యవహారం గురించి తెలుసుకుని ఉత్తరప్రదేశ్‌కు చెందిన వివేక్ ఉపాధ్యాయ, బీహార్‌కు చెందిన అమర్‌జీత్ అనే ఏజెంట్లు అభ్యర్థులకు ఉద్యోగ హామీ ద్వారా రూ. 12 లక్షల వరకు వసూలు చేశారు. పరీక్ష జరగడానికి మూడు రోజుల ముందు అభ్యర్థులను హోటల్‌కు రప్పించి వారికందరించారు. అదేవిధంగా కొందరి సాయంతో పరీక్ష 'కీ' సిద్ధం చేసి అభ్యర్థులకు అవి గుర్తించుకోవాలని చెప్పారు. అయితే, రాజీవ్ మిశ్రా అనే వ్యక్తి డబ్బు కోసం మరికొందరికి పంపించాడు. దాంతో అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు ఆరుగురిని అరెస్ట్ చేశామని, దర్యాప్తు ఇంకా జరుగుతోందని యూపీ పోలీసులు తెలిపారు. ఇక, యూపీ పోలీస్‌ కానిస్టేబుల్‌ ప్రశ్నాపత్రం కూడా లీక్ అయినట్టు అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంలో రాజీవ్‌ మిశ్రా, రవి అనే వ్యక్తులను ఇప్పటికే అరెస్టు చేశారు.

కాగా, ఆర్ఓ, ఏఆర్ఓ పరీక్ష కోసం మొత్తం 10 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 60 వేల యూపీ పోలీస్ కానిటేబుల్ ఉద్యోగాల కోసం 47 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ రెండు పరీక్షలకు చెందిన ప్రశ్నాపత్రాలు లీక్ కావడంతో ప్రభుత్వం వాటిని రద్దు చేసింది.

Advertisement

Next Story

Most Viewed