జార్ఖండ్ అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నెగ్గిన హేమంత్ సోరెన్

by Shamantha N |
జార్ఖండ్ అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నెగ్గిన హేమంత్ సోరెన్
X

దిశ, నేషనల్ బ్యూరో: జార్ఖండ్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ విశ్వాస పరీక్ష నెగ్గారు. హేమంత్ సోరెన్ కు 45 మంది ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. జార్ఖండ్ స్పీకర్ రవీంద్ర నాథ్ మహతో విశ్వాస తీర్మానంపై చర్చకు గంట సమయం కేటాయించారు. జార్ఖండ్ అసెంబ్లీలో 81 మంది సభ్యులు ఉన్నారు. కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో కొందరు విజయం సాధించడంతో సభ్యుల సంఖ్య 76కి తగ్గింది. విశ్వాస పరీక్ష నెగ్గాలంటే 38 మంది సభ్యుల మద్దతు అవసరం. కాగా.. హేమంత్ సోరెన్ నేతృత్వంలోని జార్ఖండ్ ముక్తి మోర్చాకు కాంగ్రెస్, ఆర్జేడీ మద్దతు ఉంది. బలపరీక్షలో హేమంత్ కు జేఎంఎంకు చెందిన 27 మంది, కాంగ్రెస్ కు చెందిన 17 మంది, ఆర్జేడీకి చెందిన ఒక ఎమ్మెల్యే మద్దతు తెలిపారు. బీజేపీ నేతృత్వంలోని ప్రతిపక్షానికి 30 మంది సభ్యులున్నారు.

భూకుంభకోణం కేసులో అరెస్టయిన హేమంత్

ఇకపోతే, హేమంత్ సోరెన్ తన మంత్రివర్గాన్ని విస్తరించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. జూలై 4న జార్ఖండ్ ముఖ్యమంత్రిగా మూడోసారి హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు. జనవరి 31న భూకుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈడీ అధికారులు హేమంత్‌ను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత జైలుకు తరలించారు. ఆయన వారసుడిగా ఫిబ్రవరి 2న చంపై సోరెన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఇటీవలే హేమంత్‌కు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. అయిదు నెలల తర్వాత జూన్‌ 28న బిర్సా ముండా జైలు నుంచి ఆయన విడుదలయ్యాక.. జూలై 4న సీఎంగా బాధ్యతలు చేపట్టారు.

Advertisement

Next Story