హేమమాలిని, ధర్మేంద్ర ఆస్తులెన్నో తెలుసా ?

by Hajipasha |
హేమమాలిని, ధర్మేంద్ర  ఆస్తులెన్నో తెలుసా ?
X

దిశ, నేషనల్ బ్యూరో : ఒకప్పుడు సినిమాల్లో ఓ ఊపు ఊపిన హేమ మాలిని.. ఇప్పుడు రాజకీయాల్లోనూ అదే దూకుడును కనబరుస్తున్నారు. ఇప్పటికే మూడుసార్లు బీజేపీ ఎంపీగా ఎన్నికైన హేమమాలిని ఈసారి కూడా ఉత్తరప్రదేశ్‌లోని మధుర లోక్‌సభ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తున్నారు. ఇటీవల బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ఆమె తన ఆస్తుల వివరాలను ఎన్నికల సంఘానికి తెలియజేశారు. ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్ ప్రకారం.. హేమమాలిని మొత్తం ఆస్తుల విలువ దాదాపు రూ.123 కోట్లు. ఆమెకు దాదాపు రూ.1.4 కోట్లు విలువైన అప్పులు కూడా ఉన్నాయి. అఫిడవిట్‌లో.. నటనను తన వృత్తిగా హేమమాలిని పేర్కొన్నారు. అద్దె, వడ్డీ లాభాలను ప్రధాన ఆదాయ వనరులుగా తెలిపారు. మాజీ ఎంపీ అయిన తన భర్త, నటుడు ధర్మేంద్ర దేవల్‌కు నటన, పెన్షన్, వడ్డీల ద్వారా ఆదాయం లభిస్తోందని హేమమాలిని చెప్పారు. ధర్మేంద్ర దేవల్‌కు రూ.20 కోట్ల ఆస్తులు, రూ.6.4 కోట్ల అప్పులు ఉన్నాయన్నారు.

వాహనాలు ఏమేం ఉన్నాయంటే..

హేమమాలిని 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో మధుర లోక్‌సభ స్థానం నుంచి గెలిచారు. ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ సాధించాలని ఆమె భావిస్తున్నారు. హేమ మాలినిపై ఎలాంటి క్రిమినల్ కేసులు పెండింగ్‌లో లేవు. ఆమె వద్ద రూ.13.5 లక్షల నగదు, ధర్మేంద్ర దేవల్ చేతిలో రూ.43 లక్షల నగదు ఉన్నాయి. మెర్సిడెజ్ బెంజ్, అల్కజర్, మారుతీ ఈకో సహా మొత్తం రూ.61 లక్షలు విలువైన వాహనాలను హేమ కలిగి ఉన్నారు.ఇక ధర్మేంద్రకు రేంజ్ రోవర్, మహీంద్రా బొలెరో, ఒక మోటార్ సైకిల్‌ ఉన్నాయి. మథురలో రెండోదశలో పోలింగ్ జరగనుంది.

Advertisement

Next Story

Most Viewed