ఆప్ఘనిస్థాన్‌లో భారీ హిమపాతం: 15 మంది మృతి

by samatah |
ఆప్ఘనిస్థాన్‌లో భారీ  హిమపాతం: 15 మంది మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: ఆప్ఘనిస్థాన్‌లోని పలు ప్రావీన్సుల్లో గత మూడు రోజులుగా భారీ హిమపాతం సంభవిస్తుంది. దీంతో 15 మంది మృతి చెందగా..30 మందికి పైగా గాయపడ్డారు. బల్క్, ఫర్యబ్ ప్రాంతాల్లో దీని తీవ్రత ఎక్కువగా ఉండగా..సుమారు 10వేల పశువులు సైతం ప్రభావితమైనట్టు తెలుస్తోంది. అంతేగాక ట్రాఫిక్‌కు కూడా తీవ్ర అంతరాయం కలిగిస్తోంది. ఈ సంక్షోభంపై స్పందించిన ఆఫ్ఘన్‌లోని తాలిబన్ ప్రభుత్వం వివిధ మంత్రిత్వ శాఖలతో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ముఖ్యంగా పశువుల యజమానులకు జరిగిన నష్టాన్ని వెంటనే అంచనా వేయాలని కమిటీకి సూచించింది. బల్ఖ్, జాజ్జాన్, బద్గీస్, ఫర్యాబ్, హెరాత్ ప్రావిన్స్‌లలో మొదటగా 50మిలియన్ల ఆర్థిక సాయం అందించనున్నట్టు తెలిపింది. తాలిబన్ ప్రభుత్వం నియమించిన ఈ కమిటీలు బ్లాక్ చేయబడిన రోడ్లను తెరవడం, ప్రభావిత ప్రాంతాలను ఆహార సరఫరా చేయడం, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం వంటివి వేగంగా చేపడుతున్నట్టు తాలిబన్ ప్రతినిధి మిస్బాహుద్దీన్ ముస్తీన్ వెల్లడించారు.

‘తీవ్రమైన హిమపాతం కారణంగా సలాంగ్ పాస్, ఘోర్, బద్గీస్, ఘజనీ, హెరాత్, బమ్యాన్ వంటి ప్రావిన్సులకు వెళ్లే రోడ్డు మార్గాలు మూసుకుపోయాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న మంచు కారణంగా ఈ మార్గాలను తాత్కాలికంగా అడ్డుకున్నాం’ అని పబ్లిక్ వర్క్స్ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మహ్మద్ అష్రఫ్ హక్షేనాస్ ధ్రువీకరించారు. అయితే మంచు ఇంకా కొనసాగే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. పశువుల యజమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని త్వరలోనే నష్టపరిహారం చెల్లిస్తామని చెబుతున్నారు. ప్రభావిత ప్రాంతాల్లో రెస్క్యూ టీమ్స్ సహాయక చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు.

Advertisement

Next Story