ఒడిశా, బెంగాల్, జార్ఖండ్‌లో వేడిగాలులు.. మరో వారం తర్వాతే వర్షాలు

by S Gopi |
ఒడిశా, బెంగాల్, జార్ఖండ్‌లో వేడిగాలులు.. మరో వారం తర్వాతే వర్షాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్‌తో సహా పలు రాష్ట్రాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటాయి. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన వేడిగాలులు చుట్టుముట్టాయి. ఈ రాష్ట్రాల్లో కనీసం ఏప్రిల్ 24 వరకు ఎలాంటి ఉపశమనం లభించే అవకాశం లేదు. బెంగాల్‌లోని పశ్చిమ ప్రాంతాల్లో సోమవారం(ఏప్రిల్ 22) నుంచి వర్షాలు కురుస్తాయి. శనివారం ఒడిశాలోని పలు చోట్ల 45.2 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. బెంగాల్‌లో కొన్ని ప్రాంతాల్లో 44.6 డిగ్రీల సెల్సియస్, జార్ఖండ్‌లో కొన్ని చోట్ల 43.6 డిగ్రీల సెల్సియస్, ఛత్తీస్‌గఢ్‌లో 43 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. భారత వాతావరణ విభాగం(ఐఎండీ) ప్రకారం, ఆదివారం బెంగాల్‌లోని చాలా చోట్ల, ఏప్రిల్ 24 వరకు జార్ఖండ్, బీహార్‌లో అధిక ఎండలు ఉండొచ్చని తెలుస్తోంది.

ఒడిశాలో వేడి గాలుల కారణంగా ఆది, సోమవారాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్టు ఐఎండీ సీనియర్ శాస్త్రవేత్త నరేష్ కుమార్ తెలిపారు. 'ఉష్ణోగ్రతల్లో స్వల్ప తగ్గుదల ఉండవచ్చని అంచనా వేస్తున్నాం. రెండు రోజుల తర్వాత ఒడిశాలో మళ్లీ ఎండ తీవ్రత పెరగనుంది. రాబోయే ఐదు రోజులకు సంబంధించి హెచ్చరికలు ఇచ్చాం. జార్ఖండ్‌లో సైతం ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉన్నాయని' నరేష్ కుమార్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, కేరళలో ఏప్రిల్ 24 వరకు వేడి, తేమతో కూడిన వాతావరణ పరిస్థితులు ఉంటాయని ఐఎండీ వెల్లడించింది. ఢిల్లీలో సోమవారం తేలిక పాటి వర్షం లేదా చినుకులు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. ఏప్రిల్ నెలలో దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే 1-8 రోజుల ఎక్కువ హీట్‌వేర్ రోజులు ఉండనున్నాయి. ఏప్రిల్-జూన్ కాలంలో 4-8 రోజులు సాధారణం కంటే 10-20 రోజుల హీట్‌వేవ్ ఉండనుంది. బెంగాల్‌, ఒడిశా, జార్ఖండ్‌లలో ఏప్రిల్ 22-23 తేదీల్లో ఉరుములు, ఈదురు గాలల నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed