ఢిల్లీకి రావాల్సిన నీటిని హర్యానా అడ్డుకుంటోంది: ఆప్ నేత ప్రియాంక కక్కర్ ఫైర్

by vinod kumar |
ఢిల్లీకి రావాల్సిన నీటిని హర్యానా అడ్డుకుంటోంది: ఆప్ నేత ప్రియాంక కక్కర్ ఫైర్
X

దిశ, నేషనల్ బ్యూరో: హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం ప్రతికూల రాజకీయాలు చేస్తోందని, యమునా నదిలో నీటి సరఫరాను అడ్డుకోవడంతోనే దేశ రాజధానిలో నీటి కొరత ఏర్పడిందని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్ మండిపడ్డారు. సోమవారం ఆమె ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హిమాచల్ ప్రదేశ్ విడుదల చేసిన 137 క్యూసెక్కుల నీటిని హర్యానా ప్రభుత్వం నిలిపివేసిందని ఆరోపించారు. ‘హర్యానాలోని హత్నీ కుండ్ బ్యారేజీ ద్వారా ఢిల్లీకి చేరుకోవాల్సిన 137 క్యూసెక్కుల నీటిని హిమాచల్ ప్రదేశ్ రిలీజ్ చేసింది. హర్యానాలోని కాషాయ ప్రభుత్వం ఆ నీరు ఢిల్లీకి చేరుకోవడానికి అనుమతించాల్సి ఉంది. కానీ బీజేపీ ప్రతికూల రాజకీయాల వల్ల నీళ్లు అక్కడే ఆగిపోవాల్సి వచ్చింది’ అని వ్యాఖ్యానించారు.

అంతేగాక రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం ప్రకారం 1,050 క్యూసెక్కుల ఢిల్లీ వాటాను 200 క్యూసెక్కులు తగ్గించిందని తెలిపారు. ఈ పరిస్థితిపై ఆప్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిందని, దీనిపై త్వరలోనే విచారణ జరగనుందని చెప్పారు. ఢిల్లీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ పైనా కక్కర్ ఫైర్ అయ్యారు. ఎల్జీ స్పందించి నీరు ఢిల్లీకి చేరేనా హర్యానా ప్రభుత్వంతో మాట్లాడాలని సూచించారు. ఎల్జీ ఈ అంశంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మరోవైపు ఇదే అంశంపై ఢిల్లీ మంత్రి అతిశీ నేడు ఎల్జీ సక్సేనాతో భేటీ కానున్నారు.

Advertisement

Next Story

Most Viewed