ప్లే స్టోర్ నుంచి తొలగిస్తామని 10 భారత కంపెనీలకు గూగుల్ హెచ్చరిక

by S Gopi |
ప్లే స్టోర్ నుంచి తొలగిస్తామని 10 భారత కంపెనీలకు గూగుల్ హెచ్చరిక
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత స్టార్టప్‌లకు, గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్‌కు మధ్య వివాదం కొనసాగుతోంది. గూగుల్ ప్లే స్టోర్ ఛార్జీలకు సంబంధించి ఇరు వర్గాల మధ్య సమస్య తీవ్ర స్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో శుక్రవారం గూగుల్ సంస్థ కీలక ప్రకటన చేసింది. కొన్ని కంపెనీలు సర్వీస్ ఛార్జీలను చెల్లించకుండా బిల్లింగ్ నిబంధనలను పదేపదే ఉల్లంఘిస్తున్నాయని గూగుల్ ఆరోపించింది. ఈ వ్యవహారంపై విధానపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. 'స్థానిక చట్టాలను తాము గౌరవిస్తాం. గూగుల్ ప్లే స్టోర్‌లో అందించే సేవలకు ఛార్జీలు వసూలు చేయడం తమకున్న హక్కు. ఈ విషయంలో కోర్టు గానీ, నియంత్రణ సంస్థ గానీ తిరస్కరించలేదు. ఇటీవల సుప్రీంకోర్టు సైతం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోమని చెప్పింది. 10 కంపెనీలు సర్వీస్ ఛార్జీలను చెల్లించటంలేదు. ఇతర ప్లే స్టోర్‌లకు మాత్రం చెల్లిస్తున్నాయి. కాబట్టి గూగుల్ పాలసీ నిబంధనలను ఉల్లంఘించే కంపెనీలపై చర్యలు తీసుకుంటాం. అవసరమైతే ఆయా యాప్‌లను ప్లే స్టోర్ నుంచి కూడా తొలగిస్తామని' గూగుల్ స్పష్టం చేసింది. అయితే, ప్రస్తుతానికి కంపెనీ వివరాలను గూగుల్ బహిర్గతం చేయలేదు. పరిశ్రమ వర్గాల ప్రకారం ఈ జాబితాలో ప్రముఖ భారత్ మ్యాట్రిమోనీ వంటి కంపెనీల యాప్‌లు ఉన్నట్టు తెలుస్తోంది. భారత్ మ్యాట్రిమోనీ, క్రిస్టియన్ మ్యాట్రిమోనీ సహా తమ యాప్‌లను గూగుల్ కంపెనీ ఒక్కొక్కటిగా ప్లే స్టోర్ నుంచి తొలగిస్తోందని కంపెనీ వ్యవస్థాపకుడు మురుగవేల్ జానకిరామన్ చెప్పారు. ఈ చర్య భారత ఇంటర్నెట్ రంగానికి చీకటి రోజని అతను అభిప్రాయపడ్డాడు. దీనిపై నోటీసులను సమీక్షిస్తున్నామని, తదుపరి చర్యలను పరిశీలిస్తామని అధికారులు పేర్కొన్నారు.

Advertisement

Next Story