పరీక్ష నిర్వహణే ‘నీట్’గా లేదు

by S Gopi |
పరీక్ష నిర్వహణే ‘నీట్’గా లేదు
X

దిశ, నేషనల్ బ్యూరో: నీట్-యూజీ 2024 ప్రశ్నాపత్రం లీక్ కావడం, మొత్తం 720 మార్కులలో 719 అత్యధిక స్కోర్‌లతో 67 మంది అభ్యర్థులు సాధించడం పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారానికి సంబంధించి ఎన్‌టీఏ థర్డ్-పార్టీ రివ్యూలో అంతకుమించి తీవ్రమైన నిర్వహణ లోపాలు బట్టబయలయ్యాయి. నీట్ పరీక్షలు దేశవ్యాప్తంగా దాదాపు 4,000 సెంటర్లలో నిర్వహించారు. వాటిలో 399 సెంటర్లను థర్డ్-పార్టీ స్వయంగా పరిశీలించింది. కొన్ని చోట్ల పరీక్ష జరిగే గదుల్లో సీసీ కెమెరాలు కూడా లేవని, కొన్ని చోట్ల పనిచేయడం లేదని తెలిసింది. ఎన్‌టీఏ నిబంధనల ప్రకారం, పరీక్ష జరిగే చోట్ల తప్పనిసరిగా రెండు కెమెరాలు ఏర్పాటు చేయాలి. అన్ని సెంటర్లలో ప్రశ్నాపత్రాలు భద్రపరిచిన చోట గార్డులు కూడా లేదని గుర్తించారు. థర్డ్ పార్టీ పరిశీలించిన 399 కేంద్రాల్లో 186 చోట్ల రెండు కెమెరాలు లేవు. నిబంధనల ప్రకారం కేంద్రాల్లోని సీసీ కెమెరాల నుంచి వచ్చే ఫీడ్ న్యూఢిల్లీలోని ఎన్‌టీఏ ప్రధాన కార్యాలయంలోని సెంట్రల్ కంట్రోల్ రూమ్‌కు చేరాలి. 68 కేంద్రాల్లో ప్రశ్నపత్రాలు భద్రపరిచిన గదుల వద్ద సరైన భద్రత లేదు. 83 సెంటర్లలో బయోమెట్రిక్ జాబితాలో ఉండాల్సిన సిబ్బందికి బదులు పరీక్ష హాలులో వేరే సిబ్బంది విధుల్లో ఉన్నారు. కాగా, పరీక్షా కేంద్రాల్లో మాల్‌ప్రాక్టీస్ వంటివి జరగకుండా చూసేందుకు థర్డ్-పార్టీ రివ్యూను నిర్వహిస్తారు. వీరు ఎన్‌టీఏ నిబంధనలు ఎలా అమలవుతున్నాయో గమనించి నివేదిక అందిస్తారు. ఇక, నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ అంశం వాస్తవమేనని తేలింది. ఈ వ్యవహారానికి సంబంధించి పలువురు అరెస్టయిన అభ్యర్థులు పరీక్ష రోజు ముందు రోజు రాత్రి తమకు ప్రశ్నాపత్రం లభించిందని ఒప్పుకున్నారు. మరోవైపు ప్రశ్నాపత్రం తీసుకున్న ఒక్కో విద్యార్థి నుంచి రూ.30-32 లక్షలు వసూలు చేసినట్లు నీట్ స్కామ్ సూత్రధారి అమిత్ ఆనంద్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed