ఆగష్టులో ఇప్పటివరకు రూ. 49,254 కోట్లు ఇన్వెస్ట్ చేసిన విదేశీ పెట్టుబడిదారులు!

by sudharani |
ఆగష్టులో ఇప్పటివరకు రూ. 49,254 కోట్లు ఇన్వెస్ట్ చేసిన విదేశీ పెట్టుబడిదారులు!
X

ముంబై: భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి వరుస నెలల్లో భారీగా నిధులను ఉపసంహరించుకున్న విదేశీ పెట్టుబడిదారులు ఆగష్టులో ఇప్పటివరకు రూ. 49,254 కోట్ల పెట్టుబడి పెట్టారు. ప్రస్తుత ఏడాది ఎఫ్‌పీఐలు పెట్టిన అత్యధిక మొత్తం ఇదే కావడం విశేషం. అంతకుముందు జూలైలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) దాదాపు రూ. 5,000 కోట్ల పెట్టుబడులు పెట్టారు. దేశీయంగా జూన్ త్రైమాసికంలో కంపెనీల ఫలితాలు సానుకూలంగా ఉండటంతో పాటు స్థూల ఆర్థిక గణాంకాలు మెరుగ్గా ఉన్న కారణంగా ఎఫ్‌పీఐలు భారత మార్కెట్లలో తిరిగి కొనుగోళ్లను కొనసాగిస్తున్నారని మార్కెట్ విశ్లేషకులు తెలిపారు.

డిపాజిటరీ గణాంకాల ప్రకారం, గతేడాది అక్టోబర్ నుంచి జూన్ మధ్య తొమ్మిది నెలల్లో ఎఫ్‌పీఐలు రూ. 2.46 లక్షల కోట్ల విలువైన షేర్లను భారత ఈక్విటీల్లో విక్రయించారు. జూలై నుంచి పరిస్థితులు మెరుగుపడటం, డాలర్ ఇండెక్స్ బలపడటంతో తిరిగి పెట్టుబడులు ప్రారంభించారు. ఈ క్రమంలో రానున్న నెల్లలో ముడి సరుకుల ధరౌ, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, కీలక వడ్డీ రేట్ల పెంపు ధోరణి, దేశీయంగా కంపెనీల త్రైమాసిక ఫలితాలను బట్టి ఎఫ్‌పీఐలు పెట్టుబడులను కొనసాగించవచ్చని ప్రముఖ ఫిన్‌టెక్ ప్లాట్‌ఫామ్ గోల్‌టెల్లర్ వ్యవస్థాపక సభ్యుడు వివేక్ అన్నారు. గత వారాంతంలో అమెరికా ఫెడ్ చీఫ్ జెరోమ్ పావెల్ ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు రేట్ల పెంపు ఉంటుందని ప్రకటించడంతో ఎఫ్‌పీఐ పెట్టుబడులకు సవాళ్లు ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

Advertisement

Next Story