నలుగురు భారత మత్య్సకారుల అరెస్ట్.. శ్రీలంక నేవీ వెల్లడి

by Vinod |
నలుగురు భారత మత్య్సకారుల అరెస్ట్.. శ్రీలంక నేవీ వెల్లడి
X

దిశ, నేషనల్ బ్యూరో: శ్రీలంక నావికాదళం మంగళవారం తెల్లవారుజామున నలుగురు భారతీయ మత్స్యకారులను అరెస్టు చేసింది. వారి నుంచి ఓ ట్రాలర్‌ను స్వాధీనం చేసుకుంది. ‘శ్రీలంకలో అక్రమంగా చేపల వేటకు పాల్పడిన నలుగురు మత్య్సకారులను జాఫ్నా ద్వీపకల్పంలోని ఉత్తర ద్వీపంలో అదుపులోకి తీసుకున్నాం. ఓ ట్రాలర్‌ను సీజ్ చేశాం’ అని శ్రీలంక నేవీ తెలిపింది. దీంతో ఈ ఏడాది అరెస్టైన భారత మత్య్సకారుల సంఖ్య 182కి చేరుకుంది. అలాగే 25 ట్రాలర్లను ఇప్పటి వరకు స్వాధీనం చేసుకుంది. ఇది 2023లో నమోదైన సుమారు 245 అరెస్టుల్లో దాదాపు 75 శాతానికి సమానం.

ఈ ఘటనలలో ఎక్కువ భాగం పాక్ జలసంధిలో జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇది శ్రీలంక ఉత్తర కొన నుంచి తమిళనాడును వేరుచేసే ఇరుకైన నీటి స్ట్రిప్, ఇది రెండు దేశాల మత్స్యకారులకు ప్రధాన ఫిషింగ్ కేంద్రంగా ఉంది. భారతీయులు అక్రమంగా చేపల వేటకు పాల్పడుతున్నారని ఆరోపించిన శ్రీలంక..జూన్ 20న విదేశాంగ మంత్రి జైశంకర్ శ్రీలంక పర్యటనకు వచ్చినప్పుడు ఈ విషయంపై చర్చిస్తామని ఆ దేశ ఫిషరీస్ మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా, భారత్-శ్రీలంక సంబంధాల్లో మత్స్యకారుల సమస్య ఒక వివాదాస్పద అంశంగా మిగిలిపోయిన విషయం తెలిసిందే.

Next Story