Air hostess suicide case: ఎయిర్ హోస్టెస్ ఆత్మహత్య కేసు.. ఢిల్లీ కోర్టు సంచలన తీర్పు

by Vinod kumar |
Air hostess suicide case: ఎయిర్ హోస్టెస్ ఆత్మహత్య కేసు.. ఢిల్లీ కోర్టు సంచలన తీర్పు
X

న్యూఢిల్లీ: మాజీ ఎయిర్ హోస్టెస్ గీతికా శర్మను ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో హర్యానా మాజీ మంత్రి గోపాల్ కందాను ఢిల్లీ కోర్టు మంగళవారం నిర్దోషిగా ప్రకటించింది. ఆత్మహత్యకు ప్రేరేపించడం, నేరపూరిత కుట్ర, సాక్ష్యాలను నాశనం చేయడం, ఫోర్జరీ వంటి అన్ని ఆరోపణల నుంచి గోపాల్ కందా, ఆయన అనుచరురాలు అరుణా చద్దాను ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి వికాస్ ధుల్ నిర్దోషులుగా ప్రకటించారు. గోపాల్ కందాను విడుదల చేయడంపై పోలీసులు అప్పీల్ దాఖలు చేయాలనుకుంటే రూ.లక్ష వ్యక్తిగత బాండ్‌ను సమర్పించాలని కోర్టు సూచించింది. గోపాల్ కందాకు చెందిన ఎంఎల్‌డీఆర్ ఎయిర్ లైన్స్‌లో గీతికా శర్మ ఎయిర్ హోస్టెస్‌గా పని చేసింది.

తర్వాత ఆయన కంపెనీల్లో ఒక దానికి డైరెక్టర్‌గా పదోన్నతి పొందింది. 2012 ఆగస్టు 5వ తేదీన వాయువ్య ఢిల్లీలోని అశోక్ విహార్ నివాసంలో ఆమె శవమై కనిపించారు. గోపాల్ కందా, అరుణ చద్దాల వేధింపుల వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆగస్టు 4వ తేదీన గీతికా శర్మ రాసిన ఓ సూసైట్ నోట్ బయటపడింది. గీతికా శర్మ చనిపోయిన ఆరు నెలలకే ఆమె తల్లి కూడా ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వేధింపులు, కోర్టు విచారణల వల్లే ఆమె గుండెపోటుకు గురైందని కుటుంబీకులు ఆరోపించారు.

ఎన్డీయేలో గోపాల్ కందా..

వ్యాపారవేత్త అయిన గోపాల్ కందా (46) హర్యానాలో భూపిందర్ సింగ్ హుడా నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో హోం శాఖ సహాయ మంత్రిగా పని చేశారు. తనపై కేసు నమోదవడంతో మంత్రి పదవికి రాజీనామా చేశారు. హర్యానా లోఖిత్ పార్టీ నాయకుడైన కందా సిర్సా అసెంబ్లీ నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. 2019లో మనోహర్‌లాల్ ఖట్టర్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి కందా బేషరతు మద్దతు ప్రకటించారు.

ఢిల్లీలో ఇటీవల జరిగిన ఎన్డీయే కూటమి పక్షాల సమావేశంలోనూ పాల్గొన్నారు. ఆయనపై అత్యాచారం (376), అసహజ సెక్స్ (377), ఆత్మహత్యకు ప్రేరేపించడం (306), నేరపూరిత బెదిరింపు (506), సాక్ష్యాలను నాశనం చేయడం (201), నేరపూరిత కుట్ర (120-బి), ఫోర్జరీ (466) కేసులు నమోదయ్యాయి. ఈ కేసులకు సంబంధించి స్పష్టమైన ఆధారాలు లేవంటూ ఢిల్లీ కోర్టు వీటిని రద్దు చేసింది. గోపాల్ కందాను నిర్దోషిగా విడుదల చేయడంపై గీతికా శర్మ సోదరుడు అంకిత్ నిరాశ వ్యక్తం చేశారు. పైకోర్టుకు వెళ్లేందుకు గల అవకాశాలను పరిశీలిస్తామన్నారు.

Advertisement

Next Story

Most Viewed