నాగ్‌పూర్‌లోని ఫ్యాక్టరీలో పేలుడు.. 5 మంది మృతి

by Harish |   ( Updated:2024-06-13 12:53:36.0  )
నాగ్‌పూర్‌లోని ఫ్యాక్టరీలో పేలుడు.. 5 మంది మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: నాగ్‌పూర్‌లోని ధామ్నాలో పేలుడు పదార్థాల తయారీ కర్మాగారంలో పేలుడు సంభవించగా ఈ ఘటనలో ఐదుగురు మరణించారు. గురువారం మధ్యాహ్నం 1 గంట సమయంలో ధమ్నా గ్రామంలోని చాముండి ఎక్స్‌ప్లోజివ్ ప్రైవేట్ లిమిటెడ్‌లో కార్మికులు పేలుడు పదార్థాలను ప్యాకింగ్ చేస్తుండగా అకస్మాత్తుగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 5 మంది మృతి చెందగా వారిలో నలుగురు మహిళలు ఉన్నారు, అలాగే మరో ఐదుగురు గాయపడ్డారు. ప్రమాద సమాచారాన్ని అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.

కార్మికుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారికి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. నాగ్‌పూర్‌ పోలీస్‌ కమిషనర్‌ రవీందర్‌ సింఘాల్‌ మాట్లాడుతూ, మా బృందం సంఘటనా స్థలంలో ఉన్నారని, చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. క్రాకర్లు, పేలుడు తీగలను ఇక్కడ భద్రపరిచారు. పేలుడు తీగలలో ఒకదానిలోని నిప్పురవ్వ పేలుడుకు కారణమై ఉండవచ్చని అనుమానిస్తున్నాం. యూనిట్ మేనేజర్, యజమాని పరారీలో ఉన్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకోవడానికి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎస్సీపీ) నేత అనిల్ దేశ్‌ముఖ్ మాట్లాడుతూ, ఫ్యాక్టరీ యజమాని, మేనేజర్ సంఘటన స్థలం నుండి తప్పించుకున్నారు. యూనిట్ లోపల అంబులెన్స్ లేదు. గాయపడిన వారిని ఆసుపత్రికి తీసుకెళ్లడానికి ప్రజలు, ఇతర అధికారులను సంప్రదించాం, తదుపరి విచారణ జరుగుతోందని అన్నారు. ఇటీవల కాలంలో ఫ్యాక్టరీలలో ప్రమాదాలు తరుచుగా జరుగుతున్నాయి. గత నెల, మే 23న థానే జిల్లాలోని డోంబివిలిలోని పారిశ్రామిక ప్రాంతంలో పెద్ద అగ్నిప్రమాదం సంభవించగా కనీసం ఐదుగురు మరణించగా, 56 మంది తీవ్రంగా గాయపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed