'వీటో' దేశాలపై భారత్ ఆగ్రహం.. ఐక్యరాజ్య సమితి వేదికగా గళం

by Vinod kumar |
వీటో దేశాలపై భారత్ ఆగ్రహం.. ఐక్యరాజ్య సమితి వేదికగా గళం
X

జెనీవా: వీటో అధికారం కేటాయింపులో వివక్షపై భారత్ మరోసారి న్యూయార్క్ లోని ఐక్యరాజ్య సమితి (యూఎన్) వేదికగా గళం వినిపించింది. వీటో అధికారాన్ని ఆ ఐదు అగ్ర రాజ్యాలు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఉపయోగించుకుంటున్నాయని ఆరోపించింది. "వీటో ఇనీషియేటివ్" తీర్మానం ప్రవేశపెట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా.. ‘యూజ్ ఆఫ్ వీటో’పై యూఎన్ సాధారణ సభలో ప్రసంగిస్తూ భారత కౌన్సిలర్ ప్రతీక్ మాథూర్ ఈ విషయాన్ని ప్రస్తావించారు.

వీటో పవర్‌ను గత 75 ఏళ్లుగా నైతిక విలువల కోసం కాకుండా రాజకీయ ప్రయోజనాల కోసమే వాడుకుంటున్నారని తెలిపారు. ఈ అధికారాన్ని ఐక్యరాజ్య సమితి కొనసాగించినన్ని నాళ్ళు ఇదే విధంగా దుర్వినియోగం చేస్తారని ప్రతీక్ మాథూర్ వ్యాఖ్యానించారు. ఏడాది కిందట ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర చేసిన సమయంలో ఐక్యరాజ్య సమితి ప్రవేశ పెట్టిన "వీటో ఇనీషియేటివ్" తీర్మానం.. వీటో పవర్ కలిగిన భద్రతా మండలి దేశాల కూటమిని సంస్కరించే దిశగా చేపట్టిన కంటితుడుపు చర్య మాత్రమేనన్నారు.

వీటో పవర్ ప్రపంచంలోని 5 దేశాలకే ఉండటం అనేది అన్ని ఇతర దేశాల సార్వభౌమత్వ సమానత్వ భావనకు పూర్తి విరుద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ వీటో పవర్‌ను కొనసాగించాలని యూఎన్ భావిస్తే.. దాన్ని ఇతర శాశ్వత సభ్య దేశాలకు కూడా కేటాయించాలని ప్రతీక్ మాథూర్ కోరారు. వీటో పవర్ కలిగిన దేశాలతో కూడిన భద్రతా మండలిని మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని చెప్పారు.

ప్రస్తుతం ఐరాస భద్రతా మండలిలో అమెరికా, బ్రిటన్, రష్యా, ఫ్రాన్స్, చైనాలకు శాశ్వత సభ్యత్వం, వీటో అధికారం ఉంది. 140 కోట్ల జనాభా ఉండీ, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అయిన భారత్ కు సభ్యత్వం లేకపోవడం పట్ల భారత్ పలుమార్లు తమ నిరసన తెలియజేసింది. నాలుగు దేశాలు అంగీకరించినప్పటికీ, జిత్తులమారి చైనా భారత్ శాశ్వత సభ్యత్వ హోదాకు ఒప్పుకోవడం లేదు.

Advertisement

Next Story