రిషి సునాక్ స్థానంలో ప్రీతి పటేల్..?

by Shamantha N |
రిషి సునాక్ స్థానంలో ప్రీతి పటేల్..?
X

దిశ, నేషనల్ బ్యూరో: బ్రిటన్ పార్లమెంటు దిగువ సభ హౌస్ ఆఫ్ కామన్స్ లో ప్రతిపక్ష నేతగా ప్రీతి పటేల్ పోటీ చేస్తారని తెలుస్తోంది. రిషిసునాక్ స్థానంలో కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వ రేసులో బ్రిటన్ మాజీ మంత్రి ప్రీతీ పటేల్ పోటీచేయనున్నట్లు సమాచారం. సాధారణ ఎన్నికల్లో విట్ హామ్ ప్రాంతంలో కన్జర్వేటివ్ పార్టీ ఘోర ఓటమిని చవిచూసినప్పటికీ.. ప్రీతి పటేల్ అక్కడ్నుంచి సునాయాసంగా గెలుపొందారు. అయితే, బ్రిటన్ పార్లమెంటు ఎన్నికల్లో లేబర్ పార్టీ విజయం సాధించడంతో రిషి సునాక్ తన రాజీనామాను ప్రకటించారు. ప్రతిపక్ష నేత ఎన్నిక వరకు తాత్కాలికంగా ఆ పదవిలో కొనసాగనున్నట్లు వివరించారు. ఇకపోతే ప్రీతిపటేల్ ఇతరులకు మద్దతు ఇవ్వడానికి తన వంతు కృషి చేశారు. ఇటీవలే కన్జర్వేటివ్ పార్టీలోని వివిధ వర్గాల ప్రజలు తనను పోటీ చేయమని కోరడంతో ఆమె అంగీకరించినట్లు తెలుస్తోంది. ఆమెకు కన్జర్వేటివ్ పార్టీకి చెందిన ముఖ్య నేతలు సహా కీలకమైన ఎంపీల మద్దతు ఉన్నట్లు సమాచారం. రిషి సునాక్ నుండి బాధ్యతలు స్వీకరించడానికి ఆమె బరిలో నిలిస్తే పోటీ మాత్రం తీవ్రతరం కానుంది. ఆమెకు పోటీగా భారత సంతతికి చెందిన మాజీ మంత్రి సుయెల్లా బ్రేవర్ మాన్, రాబర్ట్ జెన్రిక్, కెమి బాడెనోట్, టామ్ తుగెన్‌ధాట్ పోటీ చేసేందుకు అవకాశం కన్పిస్తోంది. ఇకపోతే, టోరీస్ కమిటీ బాబ్ బ్లాక్ మన్ ను కొత్త అధ్యక్షుడిగా ఎన్నుకుంది. నాయకత్వ పోటీకి సంబంధించిన మార్గదర్శకాలను త్వరలోనే ఖరారు చేస్తామని ఆయన ఇటీవలే తెలిపారు.

ప్రీతి పటేల్ ఎవరంటే?

ప్రీతి పటేల్ లండన్‌లోనే జన్మించారు. ఆమె తల్లిదండ్రుల స్వస్థలం గుజరాత్‌. వారు మొదట ఉగాండాలో నివసించేవారు. అయితే, ఉగాండాలో అప్పుడున్న పాలకుడు దక్షిణాసియాకు చెందినవారిపై దేశ బహష్కరణ విధించారు. దీంతో ప్రీతి తల్లిదండ్రులు బ్రిటన్‌కు వలసవచ్చారు. వైట్‌ఫోర్డ్ గ్రామర్ స్కూల్, వెస్ట్‌ఫీల్డ్ టెక్ కాలేజ్, కీల్ వర్సిటీ, ఎసెక్స్ విశ్వవిద్యాలయాల్లో ప్రీతి చదువుకున్నారు. కన్జర్వేటివ్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉద్యోగం కూడా చేశారు. 1995 నుంచి 1997 వరకూ జేమ్స్ గోల్డ్‌స్మిత్ నేతృత్వంలోని రెఫరెండమ్ పార్టీకి ప్రతినిధిగా ఉన్నారు. ఆ పార్టీ యురోపియన్ యూనియన్‌ను వ్యతిరేకించింది. విలియమ్ హేగ్ కన్జర్వేటివ్ పార్టీ అధినేతగా మారిన తర్వాత ప్రీతి తిరిగి ఆ పార్టీలో చేరారు. 1997 నుంచి 2000 వరకూ డిప్యుటీ ప్రెస్ సెక్రటరీగా పనిచేశారు. ప్రముఖ మద్యం తయారీ సంస్థ డియాజియోతోనూ ప్రీతి పనిచేశారు.

Advertisement

Next Story

Most Viewed