Bihar: ఎవరికైనా మాట్లాడే హక్కు ఉంటుంది: పీకే వ్యాఖ్యలపై తేజస్వీ యాదవ్ రియాక్షన్

by S Gopi |
Bihar: ఎవరికైనా మాట్లాడే హక్కు ఉంటుంది: పీకే వ్యాఖ్యలపై తేజస్వీ యాదవ్ రియాక్షన్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఎన్నికల వ్యూహకర్త నుంచి రాజకీయాల్లోకి మారిన ప్రశాంత్ కిషోర్ ఇటీవలి 10 ఫెయిల్ వ్యాఖ్యలపై ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ స్పందించారు. ఇది ప్రజాస్వామ్యమని, ఎవరైనా తమ అభిప్రాయాన్ని చెప్పే స్వేచ్ఛ ఉంటుందని సోమవారం విలేకరులతో తేజస్వీ యాదవ్ తెలిపారు. 'ప్రతి ఒక్కరికీ తమకు తోచిన మాటను చెప్పగలిగే హక్కు ఉంది. అది మంచిది. ఎవరైనా మాట్లాడొచ్చు. ఇదే ప్రజాస్వామ్యానికి ఉన్న సౌందర్యం. ఎలాంటి వ్యాఖ్యలనైనా స్వాగతించాలని' అన్నారు. ఇటీవల ప్రశాంత్ కిషోర్ అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా తాను కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. బీఆర్‌లో కోటి మంది ప్రజలు తరలివచ్చి పార్టీని ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి అని అన్నారు. అలాగే, రాజకీయాల్లోకి వచ్చేందుకు కనీస అర్హతల గురించి మాట్లాడారు. 10 ఫెయిల్ అయిన వారి నాయకత్వంలో బీహార్ యువత పనిచేయాల్సిన అవసరంలేదన్నారు. నేరుగా తేజస్వీ యాదవ్, నితీష్ పేర్లను ప్రస్తావించకుండా, బీహార్ ప్రజలు 10వ తరగతి ఫెయిల్ అయిన వారి కింద పనిచేసేందుకు ఇష్టపడరు. గుర్తు పెట్టుకోండి తాను అంటోంది 10 ఫెయిల్, తొమ్మిదో తరగతి కాదంటూ ఎద్దేవా చేశారు. పట్నాలోని బాపు సభాఘర్‌లో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. అక్టోబర్ 2న పార్టీ శంకుస్థాపన జరుగుతుందని, లక్ష మందికి పైగా ఆఫీస్ బేరర్లుగా పార్టీ మొదలవుతుందని ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నారు.

Advertisement

Next Story