Engineer Rashid: అబ్దుల్లాను అడిగిన తర్వాతే ఆర్టికల్ 370 రద్దు.. ఇంజనీర్ రషీద్ సంచలన వ్యాఖ్యలు

by vinod kumar |
Engineer Rashid: అబ్దుల్లాను అడిగిన తర్వాతే ఆర్టికల్ 370 రద్దు.. ఇంజనీర్ రషీద్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: బారాముల్లా ఎంపీ, అవామీ ఇత్తెహాద్ పార్టీ(ఏఐపీ) చీఫ్ ఇంజనీర్ రషీద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) నేతలు ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా కుటుంబాన్ని సంప్రదించిన తర్వాతే ప్రధాని మోడీ ఆర్టికల్ 370ని రద్దు చేశారని ఆరోపించారు. కశ్మీర్‌లో ఎన్సీకి బీజేపీ సహాయం చేసిందని దాని కారణంగానే ఎన్సీ అధికారంలోకి వచ్చిందని తెలిపారు. బుధవారం ఆయన శ్రీనగర్‌లో మీడియాతో మాట్లాడారు. ఒమర్ అబ్దుల్లా పదే పదే రాష్ట్ర హోదా, ఆర్టికల్ 370, 35A గురించి మాట్లాడుతున్నారని, కానీ ఆర్టికల్ 370ని తొలగించడానికి మూడు రోజుల ముందు ఫరూక్ అబ్దుల్లాను మోడీ కలిశారని తెలిపారు. ఆ తర్వాత ఫరూక్, ఒమర్‌లను గెస్ట్ హౌస్‌లో ఉంచారన్నారు. ఈ విషయంలో బీజేపీ, ఎన్సీలు కుమ్మక్కయ్యాయని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీ గెలుపునకు కాషాయ పార్టీ సహాయం చేసిందనడంలో ఎటువంటి సందేహం లేదని స్పష్టం చేశారు. విదేశాంగ మంత్రి జైశంకర్ పాకిస్థాన్ పర్యటనపై ఇంజనీర్ రషీద్ స్పందిస్తూ.. ఇరు దేశాలు పరస్పరం పోరాడలేమని భావించాల్సి ఉంటుందన్నారు. కశ్మీర్ సమస్యను త్వరలోనే పరిష్కరించాలని సూచించారు. కాగా, 2019 ఆగస్టులో మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed