ఎన్నికల ఫలితాలు మోడీకి నైతిక ఓటమి.. సోనియా గాంధీ విమర్శలు

by vinod kumar |
ఎన్నికల ఫలితాలు మోడీకి నైతిక ఓటమి.. సోనియా గాంధీ విమర్శలు
X

దిశ, నేషనల్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికల తీర్పు ప్రధాని మోడీకి నైతిక ఓటమిని సూచించిందని, అయినప్పటికీ ఆయన ప్రవర్తనలో ఏ మాత్రం మార్పు లేదని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ విమర్శించారు. గత పరిపాలనలో అనుసరించిన విధానాలనే మళ్లీ కొనసాగిస్తున్నారని తెలిపారు. ఓ వార్త సంస్థకు రాసిన ఆర్టికల్‌లో సోనియా ఈ విషయాలను పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలతో మోడీ సరిపెట్టుకున్నాడని చెప్పడానికి ఎటువంటి సాక్ష్యం లేదని పేర్కొన్నారు. ‘స్పీకర్ పదవికి సంబంధించి మద్దతివ్వాలని ఏకాభిప్రాయాన్ని కోరినట్టుడు దానికి ఇండియా కూటమి అంగీకరించింది. కానీ సభా సంప్రదాయాల ప్రకారం డిప్యూటీ స్పీకర్ పదవిని ఆశించింది. కానీ అందుకు ప్రభుత్వం ఆమోదించలేదు’ అని పేర్కొన్నారు. పార్లమెంటులో ఉత్పాదకతను పెంచడానికి ప్రతిపక్ష కూటమి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

ప్రచార సమయంలో తనకు తాను దైవ హోదాను కల్పించుకున్న ప్రధానికి ఎన్నికల ఫలితాలు వ్యక్తిగత, రాజకీయ పరాజయాన్ని సూచించాయని తెలిపారు. అయినప్పటికీ ఆయనలో ఏం మార్పు రాలేదని ఘర్షణ వాతావరణానికి ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు.ప్రధానమంత్రి, లోక్‌సభ స్పీకర్, బీజేపీ నాయకులు ఎమర్జెన్సీని ప్రస్తావించడాన్ని రాజ్యాంగంపై దాడి నుండి దృష్టిని మళ్లించే ప్రయత్నంగా సోనియా అభివర్ణించారు. 1977లో దేశ ప్రజలు ఎమర్జెన్సీపై స్పష్టమైన తీర్పు ఇచ్చారని, దానిని నిస్సందేహంగా ఆమోదించారని, ఇది ఒక చరిత్ర అని తెలిపారు. ప్రతిపక్షాలు ప్రజల సమస్యలను లేవనెత్తుతూనే ఉంటాయని, ప్రధాని, ఆయన ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. పూర్తిగా పరిశీలించాకే కొత్త న్యాయ చట్టాలను అమలు చేయాలని సూచించారు.

Advertisement

Next Story