'ఈడీ ప్రతీకార చర్యలకు పాల్పడకూడదు'.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

by Vinod kumar |
ఈడీ ప్రతీకార చర్యలకు పాల్పడకూడదు.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
X

న్యూఢిల్లీ : కేసుల దర్యాప్తులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ప్రతీకార చర్యలకు పాల్పడకూడదని, చట్టప్రకారమే వ్యవహరించాలని సుప్రీంకోర్టు సూచించింది. నిందితులపై ఈడీ తీసుకునే చర్యలు పారదర్శకంగా, చట్ట ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని నిర్దేశించింది. మనీలాండరింగ్‌ కేసులో గురుగ్రామ్‌కు చెందిన ఎం3ఎం కంపెనీ డైరెక్టర్లు బసంత్‌ బన్సల్‌, పంకజ్‌ బన్సల్‌ లను ఈడీ అరెస్టు చేయడాన్ని తప్పుపడుతూ దేశ సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం ఈ వ్యాఖ్యలు చేసింది. ఈడీ అరెస్టును సవాల్ చేస్తూ బన్సల్‌ సోదరులు దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు, వారికి బెయిల్‌ ను మంజూరు చేసింది. ‘‘అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేదన్న కారణంతో నిందితులను ఈడీ అరెస్టు చేయడం సరికాదు.

మనీలాండరింగ్‌ చట్టం కింద వారు నేరానికి పాల్పడ్డారని తెలిపే ఆధారాలను సేకరించాకే అరెస్టు చేయాలి. సమన్లకు సరిగ్గా స్పందించలేదని ఎవరినీ అరెస్టు చేయకూడదు. అరెస్టు సమయంలో అందుకు గల కారణాలను నిందితులకు లిఖితపూర్వకంగా అందించాలి’’ అని సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం కామెంట్ చేసింది. జూన్‌ 1న ఈడీ అధికారులు ఎం3ఎం గ్రూప్‌, బన్సల్‌ సోదరుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు జరిపారు. దీనిపై వారు వారు జూన్‌ 9న పంజాబ్‌-హరియాణా హైకోర్టును ఆశ్రయించగా.. జులై 5 వరకు వారికి అరెస్టు నుంచి మధ్యంతర రక్షణ కల్పించింది. ఈక్రమంలో జూన్‌ 14న వారిని ఈడీ అరెస్టు చేసింది. ఆ తర్వాత కోర్టు ఆదేశాలతో.. తమ కస్టడీలోకి తీసుకుంది. ఈ అరెస్టును బన్సల్‌ సోదరులు పంజాబ్‌, హరియాణా హైకోర్టులో సవాల్ చేయగా చుక్కెదురైంది. దీంతో వారు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా తాజాగా మంగళవారం బెయిల్ మంజూరైంది. ఈ విచారణ సమయంలో ఈడీ అధికారుల చర్యలపై సుప్రీంకోర్టు ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది.

Advertisement

Next Story

Most Viewed